- బస్‌స్టేషన్ వరకే సరైన రోడ్డు
- రైల్వే స్టేషన్ వరకు పోలేకపోతున్న బస్సులు
- శాటిలైట్ టెర్మినల్ తో పెరగనున్న ప్రయాణికుల తాకిడి
- రోడ్ల కోసం భూసేకరణ చేస్తున్న బల్దియా
హైదరాబాద్‌సిటీ, వెలుగు : చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు సరైన రోడ్డు లేకపోవడంతో స్టేషన్‌వరకు బస్సులు నడిపే పరిస్థితి లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రైల్వే శాఖ దాదాపు రూ.430 కోట్లతో చర్లపల్లిలో శాటిలైట్టెర్మినల్ నిర్మించింది. దీన్ని మరికొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు. దీంతో రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.
వీరి కోసం ఆర్టీసీ చర్లపల్లి రైల్వేస్టేషన్వరకు బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నా..అక్కడి వరకూ నేరుగా అప్రోచ్‌రోడ్ లేకపోవడంతో బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. రైల్వే స్టేషన్పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ 30అడుగుల వెడల్పుతో ఉండడంతో బస్సులు రైల్వేస్టేషన్వరకూ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం సికింద్రాబాద్స్టేషన్నుంచి చర్లపల్లికి 250సి బస్సు నడుపుతున్నా సరైన రోడ్డు లేక అది చర్లపల్లి బస్స్టేషన్వరకే వెళ్తోంది.
భూసేకరణపై దృష్టి
సరైన రోడ్లు వేస్తే సికింద్రాబాద్నుంచే కాకుండా సిటీలోని పలు ప్రాంతాల నుంచి చర్లపల్లికి బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్తున్నారు. బల్దియా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెడల్పునకు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే కొన్ని ఆస్తులకు మార్కింగ్కూడా పూర్తి చేసినట్టు చెప్పారు. మరికొన్ని ఆస్తులు సేకరించడానికి స్థానికులతో చర్చలు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.