రూ.38,000 కోట్లకు అమ్మేందుకు ముందుకొస్తున్న క్లబ్ ఓనర్ ఎఫ్‌ఎస్‌జీ
అమ్మి పెట్టేందుకు మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మాన్ శాక్స్ నియామకం
దివాలా నుంచి 4.4 బిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూకి పెరిగిన లివర్‌పూల్ ఎఫ్‌సీ
న్యూఢిల్లీ : ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ క్రికెట్ ఫ్రాంచైజీని ఆపరేట్ చేస్తున్న ముకేశ్ అంబానీ, పాపులర్ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్‌ను కొనే ఆలోచనలో ఉన్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆరు సార్లు యూఈఎఫ్‌ఏ ఛాంపియన్ లీగ్ విన్నర్ అయిన లివర్‌పూల్ ఎఫ్‌సీని అమ్మాలని ఈ క్లబ్ ఓనర్ యూఎస్ కంపెనీ ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ (ఎఫ్‌ఎస్‌జీ) చూస్తోంది. ఇందుకోసం పొటెన్షియల్ బయ్యర్ కోసం వెతుకుతోంది. ఈ క్లబ్‌ను అమ్మి పెట్టేందుకు తాజాగా మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మాన్ శాక్స్‌ను ఎఫ్‌ఎస్‌జీ నియమించిందని ది మిర్రర్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. దివాలా తీసిన లివర్‌పూల్ ఎఫ్‌సీని 2010 లో 400 మిలియన్ డాలర్లకు ఎఫ్‌ఎస్‌జీ కొనుగోలు చేసింది.
ప్రస్తుతం ఈ క్లబ్ బ్రాండ్ వాల్యూ 4.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. కిందటేడాది ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ రెడ్‌బర్డ్ లివర్‌పూల్ ఎఫ్‌సీలో 11 శాతం వాటాను 735 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మరో ఫుట్‌బాల్ క్లబ్ చెల్సియాను యూఎస్ కంపెనీ క్లియర్‌లేక్ ఏకంగా 3 బిలియన్ డాలర్ల (రూ.24,600 కోట్ల) కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. యూకే ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో ఈ క్లబ్ ఓనర్ అయిన రష్యా బిలియనీర్ చెల్సియాను అమ్మేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫుట్‌బాల్ క్లబ్ భారీ మొత్తానికి అమ్ముడయ్యింది. లివర్‌పూల్ ఎఫ్‌సీ కూడా పెద్ద మొత్తానికే అమ్మేందుకు ఎఫ్‌ఎస్‌జీ చూస్తోంది.
గతంలోనూ ఇలానే..
ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ క్లబ్స్, ప్రాంచైజీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్నాయి. దీనికి తోడు ముకేశ్ అంబానీకి స్పోర్ట్స్‌పై ఆసక్తి కూడా ఉండడంతో లివర్‌పూల్ ఎఫ్‌సీని ఆయన సొంతం చేసుకోవాలని చూస్తున్నారని ది మిర్రర్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఫేమస్ క్లబ్‌ను కొనుగోలు చేయడానికి మిడిల్ ఈస్ట్‌లోని ఓ బయ్యర్‌తో, యూఎస్‌లోని మరో బయ్యర్‌తో ఆయన పోటీ పడాల్సి ఉంటుందని తెలిపింది. సుమారు 4 బిలియన్ పౌండ్ల (రూ.38 వేల కోట్ల) కు అమ్మేందుకు లివర్‌పూల్ ఓనర్లు ముందుకొచ్చారని అంచనా.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ అయిన ముకేశ్ అంబానీ సంపద ప్రస్తుతం 90 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఫుట్‌బాల్ క్లబ్ మొత్తాన్ని ఆయన కొనుగోలు చేయనున్నారని ది మిర్రర్ రిపోర్ట్ పేర్కొంది. ఇలాంటి రిపోర్ట్‌లు రావడం ఇదేం మొదటి సారి కాదు. 2010, ఆగస్టులో కూడా లివర్‌పూల్ ఎఫ్‌సీని కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీ, సుబ్రతో రాయ్‌లు ముందుకొచ్చారని అప్పటిలో వార్తలొచ్చాయి. ముంబై ఇండియన్స్‌ను 2008 లో కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్పోర్ట్స్ టీమ్ ఓనర్‌గా ముకేశ్ అంబానీ పేరు సంపాదించారు. తాజా రిపోర్ట్స్‌పై లివర్‌పూల్ ఎఫ్‌సీ ఓనర్ ఎఫ్‌ఎస్‌జీ స్పందించింది. ‘ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ క్లబ్స్‌లో ఓనర్‌షిప్ మారుతుందని రూమర్స్ వస్తున్నాయి. ఫలితంగా లివర్‌పూల్ ఎఫ్‌సీలోని తమ ఓనర్‌షిప్ గురించి చాలా మంది అడుగుతున్నారు’ అని తెలిపింది.
లివర్‌పూల్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని, క్లబ్‌కు మేలు జరుగుతుందంటే సరియైన కండిషన్స్, టర్మ్స్ మధ్య కొత్త ఇన్వెస్ట్‌మెంట్లకు అనుమతిస్తామని ఎఫ్‌ఎస్‌జీ కామెంట్ చేసింది. అంబానీ కంపెనీ దేశంలో ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ ఈవెంట్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) కు కమర్షియల్ పార్టనర్‌గా కూడా ఉంది. దేశంలో క్రికెట్ బాగా పాపులర్ అయినప్పటికీ, ఫుట్‌బాల్‌కు ఆదరణ ఉంది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ను దేశంలో చాలా మంది ఫాలో అవుతున్నారు. లివర్‌పూల్‌కు మంచి క్రేజ్ ఉంది. దేశంలో ఈ క్లబ్ టీ-షర్ట్ సేల్స్ విపరీతంగా జరుగుతున్నాయి.
