- ఏప్రిల్ నుంచి స్టాండర్డ్ డిడక్షన్‌గా రూ.50 వేలు పొందే వీలు
- ఇక నుంచి డీఫాల్ట్‌గా కొత్త సిస్టమే..
న్యూఢిల్లీ: పన్నుల వ్యవస్థను మరింత సులువుగా, వేగంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది డీఫాల్ట్ కానుంది. అంటే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు డీఫాల్ట్‌గా కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. పాత సిస్టమ్ కావాలనుకుంటే ట్యాక్స్ పేయర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకునే ముందు కొత్త సిస్టమ్‌లో ఏయే మినహాయింపులు దొరుకుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రభుత్వం అందిస్తోంది. పాత ట్యాక్స్ సిస్టమ్‌లో ఇచ్చే డిడక్షన్లు, మినహాయింపులు కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో లేనప్పటికీ, ఆరు ట్యాక్స్ మినహాయింపులను మాత్రం ఈ కొత్త సిస్టమ్ అందిస్తోంది. అవి..
రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్
కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో కూడా రూ.50 వేలను స్టాండర్డ్ డిడక్షన్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఎంచుకున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఆటోమెటిక్‌గా స్టాండర్డ్ డిడక్షన్ యాడ్ అయిపోతుంది. ఇందుకోసం సపరేట్‌గా ప్రూఫ్‌లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, ట్యాక్స్ పేయర్లందరుకూ స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో లేదు. వ్యాపార వేత్తలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ స్టాండర్డ్ డిడక్షన్‌ను పొందలేరు. ఫ్యామిలీ పెన్షనర్లు (పెన్షనర్ చనిపోవడంతో పెన్షన్ అందుకునే నామినీ) కూడా స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.15,000 క్లయిమ్ చేసుకోవచ్చు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకునే ప్రతీ ఉద్యోగి రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను పొందొచ్చని పోస్ట్ బడ్జెట్ మీటింగ్‌లలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా పేర్కొన్నారు. కేవలం రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌కమ్ ఉన్నవారే స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులనే కన్ఫ్యూజన్ తొలగిపోయింది.
ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)కు ఎంప్లాయర్లు (ఉద్యోగం ఇచ్చినవారు) చేసే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్ మినహాయింపులు పొందొచ్చు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ఈ మినహాయింపులిస్తున్నారనే విషయం చాలా మందికి తెలీదు. ఎన్‌పీఎస్‌తో లింక్ అయి ఉన్న ఇతర మినహాయింపులు అంటే 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు, 80 సీసీడీ (1బీ) కింద రూ. 50 వేలు ట్యాక్స్ డిడక్షన్ పొందడం కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో కుదరదు. కానీ, ఎంప్లాయర్ ఎంప్లాయీ ఎన్‌పీఎస్ కోసం కంట్రిబ్యూట్ చేస్తే, ఉద్యోగి బేసిక్ శాలరీ + డియర్‌నెస్ అలవెన్స్‌లలో 10 శాతాన్ని ( ప్రభుత్వ ఉద్యోగి అయితే 14 శాతం) ట్యాక్స్ డిడక్షన్‌గా పొందొచ్చు. సెక్షన్ 80సీసీడీ (2) కింద కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ఈ డిడక్షన్‌ను కొనసాగిస్తున్నారు. ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ మొదట ఉద్యోగి శాలరీకి యాడ్ అవుతుంది. దీనిపై సెక్షన్ 80సీసీడీ (2) కింద శాలరీలో 10 శాతం వరకు డిడక్షన్ పొందొచ్చు.
ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్..
ఉద్యోగి పీఎఫ్ అకౌంట్‌కు ఎంప్లాయర్ చేసే కంట్రిబ్యూషన్‌పై కూడా ట్యాక్స్ డిడక్షన్స్ పొందొచ్చు. ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతం వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందడానికి కొత్త ట్యాక్స్ సిస్టమ్ అనుమతిస్తోంది. ఎంప్లాయర్ నుంచి పొందే గిఫ్ట్స్ లేదా బెనిఫిట్స్ అమౌంట్ రూ.7.5 లక్షల లోపు ఉండాలి. ఎంప్లాయర్ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కూడా ఈ అమౌంట్‌లో కలిపి లెక్కిస్తారు.
రెంటల్ ఇన్‌కమ్‌పై డిడక్షన్...
రెంటల్ ఇన్‌కమ్‌పై 30 శాతం వరకు ట్యాక్స్ డిడక్షన్‌ను క్లయిమ్ చేసుకోవచ్చు. ఏడాదిలో వచ్చే రెంటల్ ఇన్‌కమ్ నుంచి మున్సిపల్ ట్యాక్స్‌లను తీసేయగా మిగిలిన అమౌంట్‌పై ఈ డిడక్షన్ పొందొచ్చు.
పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన వంటి స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేస్తే, వీటి మెచ్యూరిటీ అమౌంట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు. కానీ, పాత సిస్టమ్ మాదిరి కొత్త సిస్టమ్‌లో 80 సీసీ కింద రూ.1.5 లక్షల వరకు డిడక్షన్ పొందే వీలుండదు.
లైఫ్ ఇన్సూరెన్స్‌పై..
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మెచ్యూరిటీ అమౌంట్‌పై ఒక లిమిట్ వరకు ట్యాక్స్ వేయడం లేదు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (యులిప్) లేదా ఎండోవ్‌మెంట్ ప్లాన్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ట్యాక్స్ బెనిఫిట్స్ కొత్త, పాత రెండు ట్యాక్స్ సిస్టమ్‌లలో కూడా పొందొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లపై అయితే ఒక ఏడాదిలో ప్రీమియం కింద రూ.2.5 లక్షల కంటే ఎక్కువ చెల్లిస్తే, ఈ ప్లాన్ల మెచ్యూరిటీ అమౌంట్‌పై ట్యాక్స్ పడుతోంది. 2021–22 లో ఈ రూల్ తీసుకొచ్చారు. తాజా బడ్జెట్‌లో ఇలాంటి రూల్‌నే నాన్ యులిప్ పాలసీల (లైఫ్ ఇన్సూరెన్స్) కు పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం ఉన్న పాలసీలను ఒక ఏడాదిలో కొనుగోలు చేస్తే, ఈ పాలసీల మెచ్యూరిటీ అమౌంట్‌పై ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ పాలసీహోల్డర్ చనిపోతే పైన పేర్కొన్న సందర్భాల్లో కూడా నామినీకి ట్యాక్స్ మినహాయింపు దొరుకుతుంది.
