గ్రేటర్ వరంగల్ లో లీకేజీల వరద!

  • తరచూ లీకవుతున్న మిషన్ భగీరథ లైన్లు
  • పైపులు పగిలి రోడ్లపై పారుతున్న నీళ్లు 
  • నిత్యం 40 ఎంఎల్ డీ వరకు వృథా
  • సకాలంలో రిపేర్లు చేయక ఇబ్బందులు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న జనాలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో తాగునీటి సరఫరాకు లీకేజీల తిప్పలు తప్పడం లేదు.  ట్రై సిటీ వ్యాప్తంగా వందల సంఖ్యలో లీకేజీలు ఉండగా..  వాటిని గుర్తించి తాగు నీటి వృథాను అరికట్టడంలో ఆఫీసర్లు శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా ఇండ్లకు చేరాల్సిన నీళ్లు కాస్త.. రోడ్లపై వరదలా పారుతున్నాయి. ఇంకా చాలాచోట్లా మోరీల పాలవుతున్నాయి. ఇలా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో కలిసి నిత్యం లక్షల లీటర్ల నీళ్లు వృథాగా పోతుండగా,  పైపుల్లో వాటర్ ప్రెజర్ తగ్గడంతో పాటు రంగుమారిన నీళ్లతో ఇబ్బందులు పడాల్సివస్తోందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీల్లోకే 40 ఎంఎల్డీ నీళ్లు

గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల ఇండ్లు ఉండగా.. మిషన్ భగీరథ, అమృత్ స్కీం కింద పనులు చేపట్టి  2.3 లక్షల వరకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. నగర వ్యాప్తంగా పాతవి, కొత్తవి అన్నీ కలిసి 26.7 కిలోమీటర్ల రా వాటర్ మెయిన్స్, 217.3 కి.మీల ఫీడర్ మెయిన్స్, 125 వాటర్ ట్యాంకులు, 2767.3 కి.మీల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు రూ.630 కోట్లకు పైగా నిధులతో నగర వ్యాప్తంగా తాగునీటి వ్యవస్థను బలోపేతం చేయగా.. క్షేత్రస్థాయిలో లీకేజీలు సమస్యగా మారాయి. 

Also Read : అర్బన్​ పార్క్​ అభివృద్ధిపై స్పెషల్​ ఫోకస్​!

నగరంలో ప్రస్తుతం 11 లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా వేస్తుండగా.. ప్రజల అవసరాల కోసం వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట, అండర్ రైల్వే జోన్ ఫిల్డర్ బెడ్ ల ద్వారా 172.3 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ప్రజల ఇండ్లకు చేరాల్సిన ఆ నీళ్లు లీకేజీల కారణంగా రోడ్లు, డ్రైనేజీల పాలవుతున్నాయి. ఒక్కో డివిజన్ లో కనీసం ఐదారు చోట్లానైనా పైపులైన్ లీకేజీలు ఉంటుండగా.. బల్దియావ్యాప్తంగా ప్రతి రోజు 40 ఎంఎల్డీకిపైగా నీళ్లు వృథాగా పోతున్నట్లు తెలుస్తోంది. లీకేజీల సమస్యను కార్పొరేటర్లు, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వివిధ కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు.

లీకేజీలతో రోడ్లన్నీ ఖరాబ్

లీకేజీల సమస్య కారణంగా నగరంలో చాలాచోట్లా రోడ్లు దెబ్బతింటున్నాయి. పెద్దమ్మగడ్డ-కేయూ మార్గంలోని గౌతమ్ నగర్ వద్ద మెయిన్ రోడ్డు కేవలం 50 మీటర్ల పరిధిలోనే  7కుపైగా  లీకేజీలున్నాయి. దీంతో ఈ ఏరియాలో వాటర్ సప్లై జరిగినప్పుడల్లా రోడ్లపై నీళ్లు వరదలా పారుతున్నాయి. ఫలితంగా ఇక్కడ రోడ్డు కూడా దెబ్బతిని గుంతలుగా మారింది. 

ఇప్పుడు లీకేజీని సవరించి, అక్కడ కొత్తగా మళ్లీ రోడ్డేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా వడ్డేపల్లి చర్చి నుంచి ఫిల్టర్ బెడ్ మార్గంలో కూడా తరచూ ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడున్న ప్రధాన పైపులైన్ కు రెండు సార్లు లీకేజీలు ఏర్పడగా.. రెండుసార్లు రిపేర్లు చేసి, రెండుసార్లు రోడ్డు వేయాల్సి వచ్చింది. ఇవే గాకుండా వరంగల్ పోచమ్మమైదాన్, దేశాయిపేట, కరీమాబాద్, జేపీఎన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా ఇదే సమస్య తలెత్తుతోంది. దీంతో పైపులైన్లు, రోడ్ల రిపేర్ల పేరున బల్దియాపై అదనంగా ఆర్థిక భారం పడినట్లయ్యింది. 

నల్లాల నుంచి మురికినీళ్లు

లీకేజీల వల్ల నల్లాల్లో మురికినీళ్లు వస్తున్నాయని గ్రేటర్ వరంగల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి చాలాచోట్ల ఉన్న ప్రధాన, డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు కొన్నేండ్ల కిందట వేసినవే కావడం కూడా సమస్యగా మారగా.. వాటి వల్లే తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాదాపు రెండేండ్ల కిందట నగరంలో లీకేజీల సమస్య తీవ్రం కావడంతో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు వరంగల్ పరిస్థితులపై దాదాపు వారం రోజుల పాటు స్టడీ చేసి వెళ్లారు. 

కానీ ఆ తరువాత ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదు.  ఇకనైనా బల్దియా పాలకవర్గ సభ్యులు, అధికారులు పైపులైన్ లీకేజీలపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాల్సిందిగా నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.