వరుస చోరీలు.. జనం బెంబేలు

  • బంగారం, నగలు, క్యాష్​ ఎత్తుకెళ్తున్న దొంగలు
  • మరికొన్ని చోట్ల బైకులు, మూగజీవాలు చోరీ
  • పోలీసులకు సవాల్​గా మారిన దొంగతనం కేసులు

మెదక్, కౌడిపల్లి, వెలుగు: కొద్ది రోజులుగా జిల్లాలో చోరీలు పెరిగిపోయాయి. ఇంటికి తాళం వేస్తే చాలు దొంగలు తమ పనికానిస్తున్నారు. వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా ఆ కేసులు పోలీసులకు సవాల్​గా మారాయి. కౌడిపల్లి, చిలప్ చెడ్, శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్, మనోహరాబాద్, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. 

ఇంటికి తాళం ఉంటే చాలు దొంగలు తాళాలు పగుల గొట్టి ఇంట్లో ప్రవేశించి నగదు, బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్తున్నారు. పగటి పూట వీధుల్లో తిరిగి ఎక్కడ ఇళ్లకు తాళాలు ఉన్నాయనేది గమనించి రాత్రివేళ చోరీకి పాల్పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఒకే రోజు చాలా ఇండ్లలో దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంలో సైతం దొంగలు పడ్డారు. ఏకంగా మండపంలోని రెండు హుండీలను ఎత్తుకెళ్లి వాటి తాళాలు పగులగొట్టి నగదు కాజేశారు. 

బైక్​లు కూడా చోరీ

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బైక్​ చోరీలు కూడా జరుగుతున్నాయి. కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామంలో గతనెల16న ఇండ్ల ముందు ఉన్న 3 బైకులను దొంగలు ఎత్తుకెళ్లారు.  మంతూరి శేకులు, గుమ్ముల దిందేశ్  బైకులను గ్రామ శివారులో వదిలేసి వెళ్లిపోగా అదే గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు బైకు ఎత్తుకెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన బెంది రాజు బైకు సైతం నెల రోజుల కింద దొంగలు ఎత్తుకెళ్లారు. జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలో సైతం పలు బైక్​లు చోరీకి గురయ్యాయి. జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.

బైక్ ఎత్తుకెళ్లారు

గత నెలలో నా ఇంటి ముందు పార్క్​ చేసిన బైక్​ ను దొంగలు ఎత్తుకెళ్లారు. పీఎస్​లో పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే నీ బైకు ఏ ఫైనాన్స్ వాడో ఎత్తుకెళ్లి ఉంటారు వాళ్ల దగ్గరికి వెళ్లి తెచ్చుకో అని పిటిషన్ తీసుకోకుండానే తిట్టి పంపించారు. చేసేది లేక ఇంటికి వచ్చాను. బైక్ పోయి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు..

బెంది రాజు, కొట్టాల, కౌడిపల్లి మండలం

త్వరలోనే పట్టుకుం టాం

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను త్వరలో పట్టుకుంటాం. దొంగతనాలు జరిగిన ఇళ్లలో క్లూస్​ టీం ఆధారాలు సేకరించింది. గ్రామాల్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగలను పట్టుకోవడం ఈజీ అవుతుంది. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే గుర్తించే అవకాశం ఉంటుంది. 

జాన్​రెడ్డి, నర్సాపూర్ సీఐ

దొంగలతో భయం 

దొంగలతో భయం కలుగుతోంది. చాలా గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. మనుషులు పడుకున్న దగ్గర నుంచే బైక్​లుఎత్తుకెళ్తున్నారు. నేను నాలుగు మేకలు కట్టేసి కాపలాగా పడుకుంటే వాటిని దొంగలు ఎత్తుకెళ్లారు. 

మల్లయ్య, లింగంపల్లి, కౌడిపల్లి మండలం