తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‎లోని ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, కీసర, చీర్యాల, నాగారం, అహ్మద్ గూడ, యాదగిరి పల్లీ, ఘాట్ కేసర్, అన్నోజిగూడ, ఆవిషాపూర్, అంకుశాపూర్‎లో ముసురు వాన పడింది. మరికొన్ని చోట్ల వాతావరణం చల్లబడి చిరు జల్లులు కురుస్తున్నాయి. 

ఉమ్మడి వరంగల్ జిల్లాపైన అల్ప పీడన ప్రభావం పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వెదర్ కూల్ అయ్యింది. పలు చోట్ల ముసురు వాన కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజక వర్గంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతన్నకు కన్నీళ్లు మిగిల్చింది. మంగళవారం (డిసెంబర్ 24) రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి పది రోజులవుతున్న ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉన్న వడ్లు వర్షానికి తడిసిపోయాయి. 

తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తు్న్నారు. మరి కొన్ని జిల్లాల్లోనూ అల్పపీడన ప్రభావం చూపడంతో వాతావరణం చల్లబడటంతో పాటు ముసురు జల్లు కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. వెదర్ డిపార్మెంట్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.