రెండు నెలల్లో శ్రీశైలం సగం ఖాళీ

  • 215 టీఎంసీల నుంచి 130 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ
  • వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా 400 టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ
  • ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 190 టీఎంసీలు తరలింపు
  • సోమశిల, కండలేరు, గండికోట రిజర్వాయర్లలో స్టోరేజీ 
  • కేఆర్​ఎంబీ ఆదేశాలు బేఖాతరు
  • బోర్డు మీటింగ్​లో ఏపీ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. కోటాకు మించి నీటిని ఏపీ తన్నుకుపోతున్నది. కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చెప్పినా.. నీటి మట్టం తగ్గిపోతున్నా.. భవిష్యత్ అవసరాలను పట్టించుకోకుండా నీటిని తీసుకెళ్లి స్టోర్ చేసుకుంటున్నది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టు రెండు నెలల్లోనే సగం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ వరకు ఎగువ నుంచి వచ్చిన వరదతో ఫుల్ కెపాసిటీతో కళకళలాడిన ప్రాజెక్టు ఇప్పుడు.. సగానికి సగం సామర్థ్యం తగ్గిపోయింది. రెండు నెలల కింద 215 టీఎంసీల నీళ్లుంటే.. ఇప్పుడు 130 టీఎంసీలకు పడిపోయింది. రెండు రాష్ట్రాలు విద్యుత్ అవసరాల నేపథ్యంలో కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కరెంట్ జనరేట్ చేశాయి. అయితే, ఏపీ మాత్రం అంతకుమించి నీటిని  తీసుకెళ్లింది.

కోటాకు మించి..

వర్షాకాలం నుంచి ఇప్పటి దాకా ఏపీ దాదాపు 400 టీఎంసీలకుపైగా నీళ్లు తరలించుకుపోయినట్టు తెలుస్తున్నది. పోతిరెడ్డిపాడుకు పడిన గండి ద్వారా 190 టీఎంసీల నీటిని తన్నుకుపోయింది. ఖరీఫ్​ సీజన్​ను (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) పక్కనపెడితే.. ఇప్పటివరకు ఏపీ పెన్నా బేసిన్​కు 240 టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోయినట్లు తెలుస్తున్నది. అలా తీసుకెళ్లిన నీటితో సోమశిల (70 టీఎంసీలు), కండలేరు (70 టీఎంసీలు), గండికోట (27 టీఎంసీలు) రిజర్వాయర్లను ఫుల్ కెపాసిటీ స్టోరేజీకి చేర్చుకున్నట్టు తెలుస్తున్నది. 

Also Read:-ఎన్ఐసీకి ధరణి చిక్కులు!. 

360 టీఎంసీల కేటాయింపులున్నాయని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (బ్రజేశ్​ కుమార్ ట్రిబ్యునల్) ముందు చెప్తున్న ఏపీ.. అంతకుమించి నీటిని తరలించుకుపోయిందన్న వాదన వినిపిస్తున్నది. ఇప్పటికీ పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తన్నుకుపోతున్నదని తెలుస్తున్నది. ఇటు నాగార్జునసాగర్ నుంచి కూడా వంద టీఎంసీల నీటిని తరలించుకుపోయిందని సమాచారం. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా తన వద్ద ఉన్న రిజర్వాయర్లను నింపుకునేందుకు ఏపీ సర్కార్ నీటిని భారీగా తరలించుకుపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ మాత్రం ఏపీ తరలించుకుపోయిన మొత్తం నీటిలో సగం కూడా తీసుకోలేకపోయింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్​ అవసరాలకు అనుగుణంగా శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని మాత్రమే మన రాష్ట్రం చేస్తున్నది.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా..

శ్రీశైలం ప్రాజెక్టులో వేగంగా నీటి నిల్వలు పడిపోతుండడంతో రెండు రాష్ట్రాలకు కొద్ది రోజుల కింద కృష్ణా బోర్డు లేఖ రాసింది. విద్యుదుత్పత్తి ఆపేయాలని, అనవసరంగా నీటిని వృథా చేయొద్దని పేర్కొన్నది. వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని, తాగునీటి అవసరాలకు మాత్రమే తీసుకోవాలని లేఖలో కోరింది. అయితే, రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి ద్వారా నీటిని తీసుకున్నా.. ఏపీ మాత్రం అదనంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకెళ్లింది. బోర్డు మాటలనూ పట్టించుకోకుండా జలాలను తరలించుకుపోయింది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తున్న 50:50 వాటాలకన్నా ఎక్కువ నీటిని ఏపీ తీసుకెళ్లిందన్న చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఈ నెల 21న కేఆర్​ఎంబీ మీటింగ్ జరగాల్సి ఉన్నా.. ఏపీ అభ్యంతరం తెలపడంతో సమావేశాన్ని వచ్చే నెల 3కి వాయిదా వేశారు. ఏపీ తరలించుకుపోయిన జలాలపై బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతోపాటు ట్రిబ్యునల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.