మాజీ వీసీలపై విజిలెన్స్ ఎంక్వైరీ ముందుకు సాగట్లేదు.. శాతవాహనలో రూ.35 కోట్ల పక్కదారిపై తేలని లెక్క

  • శాతవాహనలో రూ.35 కోట్ల పక్కదారిపై తేలని లెక్క
  • బిల్లులు సమర్పించడంలో వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం
  • కేయూ వర్సిటీలో అక్రమాలపై విచారణలోనూ అదే తీరు
  • రెండు వర్సిటీల మాజీ వీసీలపై వచ్చిన తీవ్ర ఆరోపణలు
  • ప్రభుత్వానికి విజిలెన్స్ తుది నివేదిక అందజేతలో ఆలస్యం

కరీంనగర్, వెలుగు: శాతవాహన, కాకతీయ యూనివర్సిటీల్లో జరిగిన అక్రమాలపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ ముందుకు సాగట్లేదు. బీఆర్ఎస్ హయాంలో వీసీలుగా పనిచేసి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాతవాహన వర్సిటీ మాజీ వీసీ సంకశాల మల్లేశ్, కాకతీయ వర్సిటీ మాజీ వీసీ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన విషయం తెలిసిందే. పనుల బిల్లులు, ఫైళ్లను విజిలెన్స్ ఆఫీసర్లకు సంబంధిత ఆఫీసర్లు ఇవ్వకపోవడంతో విచారణలో జాప్యం జరుగుతోంది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వానికి ఇంకా విజిలెన్స్ నివేదికలు సమర్పించడం లేదని తెలిసింది. 

రూ.35 కోట్ల పనులకు బిల్లుల్లేవు
శాతవాహన వర్సిటీలో గత వీసీ ప్రొఫెసర్ మల్లేశ్​హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలపై ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం, నోటిఫికేషన్ లేకుండానే రిటైర్డ్ ప్రొఫెసర్లను అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా నియమించడం, అర్హత లేని రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ను ఎం.రవీందర్ ను ఫైనాన్స్ ఆఫీసర్ గా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్ జె.ప్రభాకర్ రావును అపాయింట్ చేయడం, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, వర్సిటీకి చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్లను రూ.కోట్లలో ఖర్చు చేయడం, ఎలాంటి టెండర్ లేకుండానే ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులను కోసిన్ అనే సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడం.. వంటి ఆరోపణలు గత వీసీ ఎదుర్కొంటున్నారు.

దీంతో గత జూలైలో విజిలెన్స్ ఎంక్వైరీకి వేసినది తెలిసిందే. విజిలెన్స్ ఆఫీసర్లు వర్సిటీలో పలుమార్లు తనిఖీలు చేసి పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.35 కోట్ల మేర నిధులకు ఎలాంటి బిల్లులు లేనట్లు విజిలెన్స్ ఆఫీస ర్లు గుర్తించినట్లు తెలిసింది. అలాగే కొన్ని పనులకు టెండర్లు పిలవకపోవడం, కొన్నింటికి పిలిచినా ఏకపక్షంగా  నచ్చి న వ్యక్తులకు కట్టబెట్టినట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన బిల్లులు, టెండర్ పేపర్లు వర్సిటీ అధికారులు విజిలెన్స్ కు ఇవ్వకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. 

కేయూలోనూ అదే తీరు.. 
రాష్ట్ర వర్సిటీల చరిత్రలో అత్యంత వివాదాస్పదుడిగా, అవినీతిపరుడిగా ముద్రపడిన కాకతీయ వర్సిటీ మాజీ వీసీ తాటికొండ రమేశ్​పదవిలో ఉండగానే ప్రభుత్వం గత  మే18న విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా తనకు వద్ద ఉండే 16 మంది రిటైర్డ్ ప్రొఫెసర్లను అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా నియమించడం, పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడడం, వర్సిటీ పరిధిలో లంచాలు తీసుకుని ఫార్మసీ కాలేజీలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడం, వర్సిటీకి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో వసూళ్లకు పాల్పడడం, వర్సిటీ భూమిని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న ఏఆర్ పెండ్లి అశోక్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెనకేసుకురావడం.. వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ : క్లాసులు జరగట్లే.. ఫైళ్లు కదలట్లే

కేయూ భూముల కబ్జాపై రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ ఆఫీసర్లు అశోక్ బాబు ఇల్లు వర్సిటీ స్థలంలోనే ఉన్నట్లు తేల్చారు. మాజీ వీసీ రమేశ్​పై వచ్చిన మిగతా ఆరోపణలపై ఏడు నెలలుగా సమగ్రంగా స్టడీ చేసినప్పటికీ.. ప్రభుత్వానికి నివేదిక అందజేయడంలో విజిలెన్స్ ఆఫీసర్లు జాప్యం చేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.