అహ్మదాబాద్: రైల్వే మోడ్రనైజేషన్ వల్ల అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే.. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూసేందుకు ఎక్కువమంది టూరిస్టులు వస్తారని చెప్పారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఇప్పటి దాకా 50 లక్షల మంది సందర్శించారని తెలిపారు. ఆదివారం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గుజరాత్‌లోని కెవాడియాకు 8 రైళ్లను మోడీ ప్రారంభించారు. మరో మూడు రైల్వే స్టేషన్లను, దభోయ్, కెవాడియాలను కనెక్ట్ చేసే బ్రాడ్ గేజ్ లైన్‌ను కూడా స్టార్ట్ చేశారు.
కెవాడియా.. ప్లానింగ్‌కు ఓ ఉదాహరణ
‘‘కనెక్టివిటీ పెరిగేకొద్దీ, రోజూ లక్ష మందికి పైగా ప్రజలు కెవాడియాను సందర్శిస్తారని ఒక సర్వేలో తేలింది. ఎన్విరాన్మెంట్ను కాపాడుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం ఎకానమీని, ఎకాలజీని ఎలా డెవలప్ చేయొచ్చనే దానికి కెవాడియా మంచి ఉదాహరణ’’ అని మోడీ చెప్పారు. అక్కడికి టూరిస్టులు పెరగడంతోపాటు, స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ‘‘దేశంలోని చాలా ప్రాంతాలకు రైల్వే నెట్వర్క్ లేదు. ఇప్పుడు రైల్వే మోడ్రనైజేషన్ వల్ల అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోంది. రైల్వే లైన్లను బ్రాడ్ గేజ్లుగా మార్చడం, ఎలక్ట్రిఫికేషన్ చేయడం.. వేగంగా జరుగుతున్నాయి” అని వివరించారు.
ఒకేసారి ఇన్ని రైళ్లు
‘‘గతంలో కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీపై తక్కువ దృష్టి పెట్టారు. కానీ మేం రైల్వే వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నాం. దీంతో అనేక రంగాల్లో ఒకేసారి మార్పులు జరిగాయి’’ అని మోడీ వివరించారు. ఒక ప్రాంతానికి ఒకేసారి ఇన్ని రైళ్లను ప్రారంభించడం ఇదే మొదటిసారని అన్నారు.
విస్టాడోమ్ కోచ్‌లు
అహ్మదాబాద్, కెవాడియా మధ్య ప్రారంభించిన జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద సైజులో విండోలు ఉంటాయి. రైలు రూఫ్‌టాప్ కూడా అద్దాలతో ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు ప్రత్యేక సీట్లు ఉంటాయి.
రైలుతో పాటు నడుచుకుంటూ..
రైళ్లను ప్రారంభించిన తర్వాత మోడీ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘బరోడా (వడోదర) నుంచి దభోయ్కి న్యారో గేజ్ లైన్ ఉండేది. ఆ రూట్లో ట్రైన్లో వెళ్లేవాడిని. రైలు చాలా మెల్లగా వెళ్తుండేది. మీరు ఎక్కడైనా దిగి, మళ్లీ ఎక్కవచ్చు. కొన్ని సార్లు ట్రైన్ వెళ్తుంటే.. దాని పక్కనే నడుచుకుం టూ వెళ్లేవాళ్లం” అని చెప్పారు.
