యునైటెడ్ నేషన్స్: వచ్చే ఏడాది కల్లా ఇండియా జనాభా.. చైనాను దాటేస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2023 కల్లా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరిస్తుందని వెల్లడించింది. సోమవారం వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఈ మేరకు ‘2022–ప్రపంచ జనాభా అంచనాల నివేదిక’ను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం ఇండియా జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు ఉంది. 2023 నాటికి చైనాను ఇండియా అధిగమించి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుంది. ఇండియా జనాభా 2050 నాటికి 166.80 కోట్లకు చేరుకుంటుంది’’ అని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో చైనా జనాభా 131.70 కోట్లకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటుతుందని యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, పాపులేషన్ డివిజన్ ఈ నివేదికలో ప్రకటించింది.
2050 నాటికి 8 దేశాల్లోనే అధికం..
తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో 230 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. గ్లోబల్ పాపులేషన్లో ఇది 29 శాతం. దక్షిణ, మధ్య ఆసియాలో 210 కోట్ల జనాభా ఉంది. ఇది వరల్డ్ పాపులేషన్లో 26 శాతం. ఈ రీజియన్లో చైనా, ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా ఉన్నాయి. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, పిలిఫిన్స్తో, టాంజానియా జనాభా 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం అవుతుందని యూఎన్ తెలిపింది. ప్రపంచ జనాభా 2030 నాటికి 850 కోట్లకు, 2050 నాటికి 970 కోట్లకు, 2080 నాటికి 1040 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఈ ఏడాదిలోని 800 కోట్లవ శిశువు పుట్టనున్నట్లు అంచనా వేసింది.
సగటు జీవిత కాలం పెరిగింది
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సగటు జీవిత కాలం పెరిగిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2019లో ఇది 72.8 ఏండ్లుగా ఉందని వెల్లడించింది. 1990 నుంచి తీసుకుంటే.. 9 ఏండ్ల లైఫ్ టైం పెరిగినట్లు పేర్కొంది. మరణాల రేటు భారీగా తగ్గడంతో.. 2050 నాటికి మనిషి సగటు జీవిత కాలం 77.2 ఏండ్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అలాగే, 2100 నాటికి ప్రపంచ జనాభా 680 కోట్ల నుంచి 1100.80 కోట్ల మధ్య ఉంటుందని తెలిపింది.
