దేశీయ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిపై నియంత్రణ ఎత్తివేత

దేశీయ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిపై నియంత్రణ ఎత్తివేత

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిపై నియంత్రణ ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురును ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయించాలన్న నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. చమురును అన్వేషించి ఉత్పత్తి చేసిన కంపెనీలు దేశీయంగా ఎక్కడైనా క్రూడ్ అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రాయల్టీ, సెస్ కొనసాగనుంది. 

దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురు ఎగుమతిపై నిషేధం కొనసాగించింది. దేశీయ అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడ్డామని, కేవలం 15% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. రానున్న రోజుల్లో దిగుమతుల భారాన్ని తగ్గించుకుని, దేశీయంగా క్రూడ్ ఉత్పత్తి పెంచుకోవడం, ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు.