న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కార్పొరేట్ల నుంచి, ఇండివిడ్యువల్స్ నుంచి సేకరించిన గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్ 24 శాతం పెరిగిందని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్, 1 నుంచి అక్టోబర్, 8 మధ్య దేశ గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్ రూ.8.98 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. రీఫండ్స్‌ను తీసేస్తే నికరంగా రూ.7.45 లక్షల కోట్లు వచ్చాయని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే టైమ్‌తో పోలిస్తే ఈసారి పర్సనల్ ట్యాక్స్ కలెక్షన్ (ఇందులోనే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా కలిసి ఉంది) 32 శాతం పెరగగా, కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ 16.73 శాతం ఎగిసింది.
ఏప్రిల్,1 నుంచి అక్టోబర్, 8 మధ్య వచ్చిన గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్ పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను వేసిన బడ్జెట్ అంచనాల్లో 52.46 శాతానికి సమానం. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.20 లక్షల కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనావేసింది. 2021–22 లో రూ.14.10 లక్షల కోట్లు వచ్చాయి. ‘డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ నెల 8 నాటికి రూ.8.98 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. కిందటేడాది ఇదే టైమ్‌లో వచ్చిన గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్స్‌తో పోలిస్తే ఇది 23.8 శాతం ఎక్కువ’ అని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఏప్రిల్ 1– అక్టోబర్ 8 మధ్య రూ. 1.53 లక్షల కోట్లను ట్యాక్స్ రీఫండ్‌గా ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చింది. కిందటేడాది ఇదే టైమ్‌లో ఇచ్చిన ట్యాక్స్ రీఫండ్స్‌తో పోలిస్తే ఇది 81 శాతం ఎక్కువ. ఇన్‌ఫ్లేషన్ 6–7 శాతం మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్యాక్స్ కలెక్షన్ మెరుగ్గా ఉండడం దేశ ఎకానమీకి చాలా కీలకమని ఎనలిస్టులు అన్నారు. ఎకానమీ బలంగా రికవరీ అవుతుండడం, కంపెనీల లాభాలు పెరగడంతో ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతోందని తెలిపారు.
