ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం: సుప్రీంకోర్టు

  • పిటిషనర్​ స్వేచ్ఛను కూడా ఆపలేం: సుప్రీంకోర్టు
  • తిరుపతన్న పాత్రపై విచారణ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
  • తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు:  ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని, కొనసాగింపు పేరుతో పిటిషనర్​ స్వేచ్ఛను కూడా తాము ఆపలేమని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మేకల తిరుపతన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిరుడు అక్టోబర్ 20న సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. సుదీర్ఘకాలంగా జైలులో ఉంటున్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో పొందుపరిచారు. గతంలో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోసారి బుధవారం ఈ పిటిషన్ జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఎన్​. కోటీశ్వర్ సింగ్   ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషనర్ తరఫున అడ్వకేట్లు​ సిద్ధార్థ దవే, మోహిత్ రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్​ సిద్దార్థ లూథ్రా, ఏవోఆర్​ దేవినా సెఘల్​ హాజరయ్యారు. 

ప్రభుత్వం తరఫు అడ్వకేట్​ లూథ్రా  వాదిస్తూ.. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో తిరుపతన్న ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌తో పాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారని..  2023 డిసెంబర్‌‌‌‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేశారని వివరించారు. అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నేతల ఆదేశాలతో.. అందరి ఫోన్లను ట్యాప్‌‌‌‌ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వాదనలపై పిటిషనర్ తరఫు అడ్వకేట్ దవే అభ్యంతరం తెలిపారు. 

తిరుపతన్న గత 9 నెలలుగా జైలులో ఉన్నారని.. ఆయన పాత్రపై ఇప్పటికే చార్జ్​షీట్‌‌‌‌ దాఖలైందన్నారు. అయినా తిరుపత్నను జైల్లో  ఉంచడం సరికాదని, బెయిల్‌‌‌‌ పొందడం ఆయన హక్కు అని వాదించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదు. దర్యాప్తు పేరుతో పిటిషనర్‌‌‌‌ స్వేచ్ఛను అడ్డుకోలేరు. విచారణకు ఇంకా ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా తెలపండి” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సర్కార్ అడ్వకేట్​ లూథ్రా స్పందిస్తూ.. విచారణ పూర్తయ్యేందుకు మరో 4 నెలలు పడుతుందని, అఫిడవిట్‌‌‌‌ దాఖలుకు సమయం కావాలని కోరారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను 27కు వాయిదా వేసింది.