ఐపీఎల్‌‌‌‌ వేలంలో పేసర్లు అధరగొట్టారు

  • రూ. 10.75 కోట్లు పలికిన భువనేశ్వర్ కుమార్‌‌‌‌‌‌‌‌
  • దీపక్ చహర్‌‌‌‌‌‌‌‌కు రూ. 9.25 కోట్లు
  • ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌, ముకేశ్‌‌‌‌కు చెరో 8 కోట్లు
  • ముగిసిన ఐపీఎల్ వేలం
  • 182 మంది ప్లేయర్లకు చాన్స్‌‌‌‌
  • మొత్తంగా 639.15 కోట్లు ఖర్చు చేసిన పది ఫ్రాంచైజీలు

జెడ్డా : రెండేండ్లకు పైగా టీమిండియాకు దూరమైన వెటరన్‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ కుమార్  జాక్‌‌‌‌పాట్ కొట్టాడు. సోమవారం, రెండో రోజు ఐపీఎల్‌‌‌‌ వేలంలో అత్యధిక ధర పలికాడు. గత సీజన్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌కు ఆడిన భువీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ)  రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు దూరమైనా ఐపీఎల్‌‌‌‌లో అనుభవం, రికార్డు ఉండటంతో భువీకి మంచి డిమాండ్ ఏర్పడింది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో  287 టీ20లు ఆడిన భువనేశ్వర్ 300 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు ఎనిమిది కంటే తక్కువగా ఉంంది. 

జట్టులో కనీసం ముగ్గురు ఇండియన్ పేసర్లు అవసరమైన నేపథ్యంలో రెండో రోజు వేలంలో వారి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. గాయంతో ఆటకు దూరమైన దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ కోసం ముంబై రూ. 9.25 కోట్లు పెట్టగా.. ఇండియా టెస్టు ప్లేయర్‌‌‌‌‌‌‌‌  ఆకాశ్ దీప్‌‌‌‌ను  లక్నో  8 కోట్లకు తమ జట్టులోకి తీసుకుంది. టెస్టు రిజర్వ్ ప్లేయర్ ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను 8 కోట్లతో  ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌టీఎం ఉపయోగించి రిటైన్ చేసుకుంది. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న తుషార్ దేశ్‌‌‌‌పాండే (రూ. 6.5 కోట్లు, రాజస్తాన్‌‌‌‌) కూడా మంచి రేటు పలికాడు. 

సౌతాఫ్రికా పేస్ ఆల్‌‌‌‌రౌండర్ మార్కో యాన్సెన్‌‌‌‌ను ఏడు కోట్ల మొత్తంతో పంజాబ్‌‌‌‌ సొంతం చేసుకుంది. గతంలో రూ. 18 కోట్లు పలికిన ఇంగ్లండ్‌‌‌‌ పేస్ ఆల్‌‌‌‌రౌండర్ సామ్ కరన్‌‌‌‌ను సీఎస్కే ఈసారి 2.4 కోట్లకే తిరిగి తీసుకుంది. ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన  నితీష్ రాణా రూ. 4.2 కోట్లతో రాజస్తాన్ రాయల్స్  టీమ్‌‌‌‌లో చేరాడు.  రెండు రోజుల పాటు జరిగిన వేలంలో మొత్తంగా 182 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. పది ఫ్రాంచైజీలు మొత్తంగా 639.15 కోట్లు ఖర్చు చేశాయి. సీఎస్కే, పంజాబ్‌‌‌‌, గుజరాత్‌‌‌‌ రిటెన్షన్‌‌‌‌ సహా మొత్తం 25 మంది ప్లేయర్ల కోటాను పూర్తి చేసుకోగా.. రాజస్తాన్‌‌‌‌, హైదరాబాద్​ అత్యల్పంగా 20 మందితోనే సరిపెట్టాయి.

13 ఏండ్లకే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లోకి..బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుర్రాడు సూర్యవంశికి రూ. 1.10 కోట్లు

రెండో రోజు వేలంలో భువనేశ్వర్ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిస్తే.. బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైభవ్ సూర్యవంశి హైలైట్‌‌‌‌‌‌‌‌గా మారాడు. 13 ఏండ్లకే మెగా లీగ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. ఈ బుడ్డోడిని రూ. కోటి పది లక్షలతో రాజస్తాన్ రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19తో జరిగిన యూత్‌‌‌‌‌‌‌‌ టెస్టులో మెరుపు సెంచరీ కొట్టి  సూర్యవంశి అందరి దృష్టిని ఆకర్షించాడు.  యూత్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ చేసిన యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు.  బీహార్ క్రికెట్ అసోసియేషన్  నిర్వహించిన అండర్–-19 వన్డే టోర్నీలో అజేయ ట్రిపుల్ సెంచరీ కొట్టి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే ఐదు రంజీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడాడు. ప్రస్తుతం  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న ఈ కుర్రాడు రూ. 30 లక్షల బేస్‌‌‌‌‌‌‌‌ప్రైస్‌‌‌‌‌‌‌‌తో వేలంలోకి రాగా.. ఢిల్లీ కూడా అతని కోసం పోటీ పడింది. చివరకు రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకుంది.

సన్‌‌ రైజర్స్ టీమ్‌‌ ఇదీ

రిటెన్షన్స్‌‌లో కీలక ఆటగాళ్లను నిలుపుకొని తొలి రోజు షమీ, ఇషాన్‌‌, హర్షల్‌పటేల్‌ను తీసుకున్న సన్ రైజర్స్‌‌ రెండో రోజు తమ బెంచ్ స్ట్రెంత్‌‌ను పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఉనాద్కట్‌‌, కమిందు మెండిస్‌‌, ఎషాన్‌‌ మలింగతో పాటు పలువురు కుర్రాళ్లను తక్కువ రేటుకే తీసుకుంది.  

రిటైన్షన్స్‌‌ : హెన్రిచ్‌ క్లాసెన్ (23 కోట్లు), పాట్  కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్ల), ట్రావిస్ హెడ్ (14 కోట్లు),  నితీశ్‌‌ కుమార్ రెడ్డి (6 కోట్లు). 
కొనుగోలు : మహ్మద్ షమీ (10 కోట్లు), హర్షల్ పటేల్ (8 కోట్లు), ఇషాన్ కిషన్ (11.25 కోట్లు), రాహుల్ చహర్ (3.2 కోట్లు), జంపా(2.40 కోట్లు), మనోహర్(3.20 కోట్లు), సిమర్‌‌జీత్ (1.50 కోట్లు), ఎషాన్ మలింగ (1.20 కోట్లు), ఉనాద్కత్ (1 కోటి), బ్రైడన్ కార్సే (1కోటి), కమిందు మెండిస్ (75 లక్షలు), అనికేత్ వర్మ (30 లక్షలు),  జీషన్ అన్సారీ (40 లక్షలు), అథర్వ తైడే (30 లక్షలు), సచిన్ బేబీ (30 లక్షలు).

తెలుగు ప్లేయర్లకు నిరాశ

ఐపీఎల్‌‌‌‌ వేలంలో తెలంగాణ, ఆంధ్ర క్రికెటర్లను  ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. హెచ్‌‌‌‌సీఏ నుంచి ఏడుగురు, ఏసీఏ నుంచి 12 మంది బరిలోకి రాగా.. కేవలం నలుగురికే చాన్స్ వచ్చింది.  సిరాజ్‌‌‌‌ మినహా మిగతా తెలంగాణ ప్లేయర్లు అన్‌‌‌‌సోల్డ్‌‌‌‌గా మిగిలారు. గత సీజన్‌‌‌‌లో సీఎస్కేకు ఎంపికైన అవనీశ్‌‌‌‌తో పాటు తన్మయ్ అగర్వాల్‌‌‌‌, రోహిత్‌‌‌‌ రాయుడుకు నిరాశే మిగిలింది. 

డుప్లెసిస్‌‌‌‌కు రెండు కోట్లే..శార్దూల్‌‌‌‌, పృథ్వీకి చుక్కెదురు

ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ  మాజీ కెప్టెన్ డుప్లెసిస్ కోసం పోటీ లేకపోవడంతో అతని బేస్‌‌‌‌ప్రైస్‌‌‌‌ రూ. 2 కోట్లతోనే ఢిల్లీ తమ జట్టులో చేర్చుకుంది. ఇండియా స్పిన్‌‌‌‌ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌‌‌‌ (రూ. 3.2 కోట్లు, గుజరాత్‌‌‌‌) కూడా తక్కువ రేటే పలికాడు. మరో స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా రూ. 5.75 కోట్లతో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు  శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌తో పాటు  న్యూజిలాండ్ స్టార్‌‌‌‌‌‌‌‌ కేన్ విలియమ్సన్‌ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

శార్దూల్‌‌‌‌లో టీ20 క్రికెట్‌‌‌‌కు అవసరమైన స్పీడ్‌‌‌‌ లేకపోవడం ప్రతికూలంగా మారింది. ఫామ్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సమస్యలతో పాటు గ్రౌండ్‌‌‌‌ బయట వివాదాలు షాను  లీగ్‌‌‌‌కు దూరం చేశాయి. తొలుత అన్‌‌‌‌సోల్డ్‌‌‌‌గా మిగిలినా చివర్లో మరోసారి వేలంలోకి వచ్చిన అజింక్యా రహానె (1.5 కోట్లు), మొయిన్ అలీ (2 కోట్లు)ని కేకేఆర్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (2 కోట్లు)ను గుజరాత్,  అర్జున్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ (30 లక్షలు)ను ముంబై తీసుకున్నాయి. 

రెండో రోజు వేలం టాపర్లు

భువనేశ్వర్ (ఆర్‌‌‌‌సీబీ) రూ. 10.75 కోట్లు 
దీపక్ చహర్ ( ముంబై) రూ. 9.25 కోట్లు 
ఆకాష్ దీప్ (లక్నో) రూ. 8 కోట్లు 
ముకేశ్‌ కుమార్  (ఢిల్లీ) రూ. 8 కోట్లు (ఆర్‌‌‌‌టీఎం)
మార్కో యాన్సెన్ (పంజాబ్‌‌) రూ. 7 కోట్లు