కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం చివరివారం పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు కోనేరులో స్నానాలు చేసి మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. మరికొంత మంది స్వామికి అభిషేకంచేసి  నిత్య కల్యాణం జరిపించారు. గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. 

కార్తీక దీపోత్సవంలో భాగంగా ఆలయంలోని ముఖ మండపంలో శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించారు. మల్లన్న గుట్టపై ఉన్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్, ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిం చారు.- కొమురవెల్లి, వెలుగు