హైదరాబాద్: పోలీస్ ఉన్నతాధికారుల ఇళ్ల పై డ్రోన్ కెమెరాలు తిరగడం కలకలం రేపుతోంది. తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు డీజీ రవి గుప్తాతోపాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్ల మీద డ్రోన్ కెమెరాలతో విజువల్స్ తీయడం సంచలనం రేపుతోంది. గతంలో ఈ అధికారులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరాల వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులకు సదరు అధికారుల కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కెమెరాలను ఎగరవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కెమెరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డ్రోన్ కెమెరాలు ఎగరడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం.
