సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్  (ఎస్ఎస్ఏ )లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.  ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న పది విభాగాలకు చెందిన ఉద్యోగులు న్యాయంగా వారికి రావాల్సిన సౌకర్యాల కోసం అనేకేండ్లుగా ఉద్యమాలు చేస్తూ నేడు సమ్మెలో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల ధర్నా టెంట్లకు వద్దకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ వేదికల్లో భట్టి విక్రమార్క సహా అనేకమంది కాంగ్రెస్ పెద్దలు సైతం ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ ప్రభుత్వ పాలన సంవత్సరం దాటినా ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వ  కార్యచరణ లేదు. ఈ క్రమంలో వివిధ సంఘాల కింద ఉన్న ఉద్యోగులందరూ జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్లినా కూడా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడం లేదు. ఉద్యోగులకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవడం లేదు. సర్వ శిక్ష ఉద్యోగులు కోరుతున్న న్యాయ, ధర్మబద్ధమైన డిమాండ్స్ కోసం సమ్మె చేసే పరిస్థితి ఏర్పడటం విషాదం. జాతీయ అక్షరాస్యత సగటు తక్కువగా ఉన్న మండలాలలో  కేంద్ర ప్రభుత్వం  కస్తూరిబా గాంధీ విద్యాలయాలను, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్​ను  2004లో  దేశవ్యాప్తంగా 4,982 నెలకొల్పింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 479 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు 30కు పైగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో  నెలకొల్పారు. 316 కేజీబీవీలలో జూనియర్ కాలేజీలను సైతం అప్​గ్రేడ్  చేశారు. 

 ఉద్యోగులపై పని ఒత్తిడి 

ఒక్కొక్క విద్యాలయంలో 300 నుంచి 400 మంది బాలికలు  ఉంటున్నారు. వీరిని నాన్ టీచింగ్ వర్కర్స్ తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు.  నాన్ టీచింగ్ వర్కర్స్  ఉదయం ఐదు గంటలకు ప్రారంభించి రాత్రి 7:00 గంటల వరకు రోజుకు16 గంటల పైగా విద్యాలయాలలోనే గడుపుతున్నారు. ఉదయం టిఫిన్,  మధ్యాహ్నం భోజనం, స్నాక్స్,  రాత్రి డిన్నర్ వందలాది మంది పిల్లలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వండి వడ్డిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన వేతనం కానీ, పీఆర్సీ నివేదిక చెప్పిన కనీస వేతనం కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ జీవో ప్రకారం కానీ వేతనాలు ఇవ్వకుండా రూ. 9,750  ఇస్తున్నారు.  రోజుకు 10 గంటలు వేడిపొయ్యిల వద్ద ఉండి 50 కేజీల అన్నం గిన్నెలను ఎత్తి దించే మహిళా ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్నారు. చాకిరీ చేయలేక అనారోగ్యానికి గురై తమ ఉద్యోగాలు బంద్ చేస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా ఉంది. 400 మంది పిల్లలకు ఒకే ఏఎన్ఎం ఉండటం కారణంగా ఏఎన్ఎంలకు  కుటుంబాలతో సంబంధం లేకుండా నిరంతరం హాస్టళ్లల్లోనే  విధులు నిర్వహించాల్సి వస్తోంది.

 ఏఎన్ఎంలకు ప్రభుత్వం తగిన వేతనం ఇస్తుందా అంటే కేవలం రూ.14,300 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. నిత్యం డీఈఓ ఆఫీసుకి, రైస్ డిపోలకు, స్కూల్స్​కి ప్రయాణాలు చేసి బిల్లులు చేస్తున్న అకౌంటెంట్ల  పరిస్థితి అగమ్య గోచరం.  వారికి టీఏ, డీఏలాంటి సౌకర్యం లేకుండా ఉన్నాయి. వారి వేతనంలో  50% రవాణా ఖర్చులకి సరిపోతున్నది.  క్రాఫ్ట్, కంప్యూటర్ లాంటి టీచర్స్ వర్కర్స్ కి రూ.7,500 ఇచ్చి చేతులు  దులుపుకుంటున్నారు. వార్డెన్ పోస్ట్ లేకపోవడంతో ఎస్ఓలపై విపరీతమైన పని ఒత్తిడితో అనారోగ్యాలకు గురవుతున్నారు. 

న్యాయం జరగాలి

61 సంవత్సరాలు దాటిన ఎస్ఎస్​సి ఉద్యోగులకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇంటికి  పంపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అంగన్​వాడీ, ఆశాలలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన ప్రభుత్వాలు, కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్​లో  పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్​ సోర్సింగ్ కార్మికులకు  మాత్రం  ఆ పథకాన్ని వర్తింపక చేయకపోవడం శోచనీయం. ఎన్నికల అనంతరం మంత్రులు వివిధ సందర్భాలలో ఉద్యోగుల వర్కర్స్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇపుడు స్పందించకపోవడం అన్యాయం. తెలంగాణ ఆడపడుచులుగా, పేద బిడ్డలకు విద్యా సౌకర్యాన్ని అందిస్తున్న మహిళా ఉద్యోగులుగా, ప్రభుత్వం ఆలోచించి వారికి  అందవలసిన సౌకర్యాలు అన్నిటిని వారికి తక్షణమే అందించాలి.

కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి

కనీస వేతనం, ఉద్యోగ భద్రత, మహిళా ఉద్యోగులకు సాధారణంగా ఉన్న సేవలను వీరు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. సాధారణ సెలవులు,  ప్రసూతి సెలవులు కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ లాంటివి లేనే లేవు. హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, న్యాయబద్ధంగా రావాల్సిన రక్షణ పథకాలు కూడా రావటం లేదు. పదేండ్లుగా  ఈ సంస్థల అభివృద్ధి కోసం, పేద పిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కర్స్ రెగ్యులరైజ్ చేసే ఉద్దేశమే ప్రభుత్వాలకి లేదు అనిపిస్తుంది. మణిపూర్, పంజాబ్, త్రిపుర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఉద్యోగులను  రెగ్యులరైజ్ చేశారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో  బేసిక్ పే చెల్లిస్తున్నారు. కానీ,  తెలంగాణ రాష్ట్రంలో  కనీస వేతనం కూడా దక్కటం లేదు. వీరి సమస్యలు పరిష్కారం కావాలంటే ఎస్ ఎస్ సి (సర్వ శిక్ష అభియాన్) ను  విద్యాశాఖలో విలీనం చేయాలని, అందరినీ రెగ్యులరైజ్ చేయాలని సమాన పనికి సమాన వేతనం, బేసిక్ పేని నిర్ణయించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వైద్య తదితర సౌకర్యాల కోసం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.

- ఆవుల అశోక్