హైదరాబాద్, వెలుగు: ‘లగచర్ల దాడి’ కేసు సెల్‌ఫోన్ల చుట్టూ తిరుగుతున్నది. ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుచరుడు సురేశ్ సెల్‌ఫోన్స్ రికవరీలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నరేందర్‌రెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్న ఐఫోన్ పాస్‌వర్డ్‌ను చెప్పకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడైన సురేశ్ తన ఫోన్‌ను ముక్కలుగా చేసి ధ్వంసం చేశాడు.
దీంతో ఈ ఘటనకు సంబంధించిన రహస్యాలు వీరిద్దరి సెల్‌ఫోన్స్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుట్రకు సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు సెల్‌ఫోన్ డేటా తప్పనిసరి కావడంతో నరేందర్‌రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇందుకోసం ఐదురోజులు కస్టడీ కోరుతూ కొడంగల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నరేందర్ రెడ్డి ఫోన్..!
దర్యాప్తులో భాగంగా నరేందర్‌రెడ్డి ఫోన్‌లో ఉన్న సీక్రెట్స్‌ను వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అరెస్ట్ చేసిన రోజే ఆయన ఐ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. ఘటనకు ముందు కేటీఆర్ సహా పలువురు ముఖ్యనేతలతో మాట్లాడినట్టు గుర్తించారు. సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ డిటెయిల్స్ రికార్డ్ (సీడీఆర్) సేకరించారు.
ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటెయిల్స్ రికార్డ్(ఐపీడీఆర్) ద్వారా సెల్‌ఫోన్‌తో జరిపిన పూర్తి ఆన్‌లైన్ యాక్టివిటీస్ గుర్తించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. అయితే, నరేందర్‌రెడ్డి తన ఫోన్ పాస్‌వర్డ్‌ను చెప్పకపోవడంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఫోన్ ఓపెన్ చేసేందుకు యత్నిస్తే అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించడంతో పాటు ఫోన్ పాస్‌వర్డ్ తెలుసుకుంటామని చెప్పారు.
ప్లాన్ ప్రకారం ఫోన్ ధ్వంసం
గత నెల11న లగచర్ల దాడి ఘటన జరిగిన రోజే సురేశ్ తన ఫోన్‌ను ముక్కలు ముక్కలుగా చేశాడు. సెల్‌ఫోన్ పార్ట్స్ పోలీసులకు దొరక్కుండా ఎక్కడో దాచేశాడు. పోలీసులకు చిక్కకుండా బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ లాయర్ఇంట్లో షెల్టర్ తీసుకున్నాడని తెలిసింది. ఇలా 8 రోజులు పోలీసులను తిప్పలు పెట్టాడు. పోలీసులకు తన జాడ తెలిసిందనే అనుమానంతో గత నెల 19న కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతి తో కస్టడీకి తీసుకుని మంగళవారం, బుధవారం విచారించారు. కానీ ముక్కలు చేసిన ఫోన్ జాడ చెప్పలేదని తెలిసింది. దీంతో మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు శుక్రవారం కోర్టును అభ్యర్థించనున్నారు.