- తొలి ఇన్నింగ్స్‌లో 180కే ఆలౌట్
- ఆరు వికెట్లతో స్టార్క్ విజృంభణ
- ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 86/1
అడిలైడ్: ఆస్ట్రేలియాతో పింక్ టెస్ట్ (డే నైట్)లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ (6/48) పదునైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చతికిలపడ్డారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (54 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), కేఎల్ రాహుల్ (37) పోరాడటంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 44.1 ఓవర్లలో 180 రన్స్ చేయగలిగింది. శుభ్‌మన్ గిల్ (31) మోస్తరుగా ఆడాడు.
ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో 86/1 స్కోరు చేసింది. నేథన్ మెక్‌స్వీని (38 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఖవాజా (13)ను ఔట్ చేసిన బుమ్రా (1/13) ఈ ఏడాది 50 వికెట్లను ఖాతాలో వేసుకున్న తొలి పేసర్‌గా నిలిచాడు. మూడో సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్11వ ఓవర్లోనే ఖవాజా వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో మెక్‌స్వీని, లబుషేన్ నిలకడగా ఆడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. ప్రస్తుతం కంగారూ టీమ్ 94 రన్స్ వెనుకంజలో ఉంది.
ఆసీస్ పేసర్ల జోరు
పచ్చికతో కూడిన పిచ్‌పై టాస్ నెగ్గిన ఇండియా రెండో ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఇది ఎంత ప్రమాదమో తొలి బాల్‌కే తెలిసొచ్చింది. స్టార్క్ వేసిన ఇన్నింగ్ ఫుల్లర్ బాల్‌కు యశస్వి జైస్వాల్ (0) ఎల్బీ అయ్యాడు. వన్ డౌన్‌లో వచ్చిన గిల్ మంచి కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. 21 బాల్స్ తర్వాత స్టార్క్ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చాడు.
అవతలి వైపు బోలాండ్ (2/54), కమిన్స్ (2/41)ను రాహుల్ దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బోలాండ్ బౌలింగ్‌లో ఓ నో బాల్ ఔట్ నుంచి కూడా బయటపడ్డాడు. 19వ ఓవర్‌లో గిల్‌ను ఎల్బీ చేసి బోలాండ్ నిలకడగా ఆడుతున్న ఈ జోడీని విడగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు 69 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆ వెంటనే స్టార్క్ తన వరుస ఓవర్లలో రాహుల్, విరాట్ కోహ్లీ (7)ని పెవిలియన్‌కు పంపాడు. దాంతో12 రన్స్ తేడాలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా 81/4తో తొలి సెషన్ ముగించింది.
నితీశ్ రెడ్డి ఒంటరి పోరాటం..
రెండో సెషన్‌లోనూ స్టార్క్ విజృంభణ కొనసాగింది. ఇన్, ఔట్ స్వింగ్‌తో పాటు ఫుల్ లెంగ్త్ బాల్స్‌తో ఇండియా లైనప్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆరేండ్ల తర్వాత మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (3) ఘోరంగా ఫెయిలయ్యాడు. బోలాండ్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌కు ఎల్బీ అవడంతో ఇండియా 87/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్ (21)తో కలిసి తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి పోరాట స్ఫూర్తి చూపెట్టాడు. ఆసీస్ పేసర్లను దీటుగా ఎదుర్కొని స్కోరును 150 దాటించాడు.
స్టార్క్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్‌తో స్లిప్ కార్డన్ మీదుగా కొట్టిన బౌండ్రీ తన ఆటకే హైలైట్. నాలుగు బాల్స్ తర్వాత బోలాండ్ వేసిన ఫుల్లర్‌ను సూపర్ సిక్సర్‌గా మలిచాడు. ఆరో వికెట్‌కు 22 రన్స్ జోడించి పంత్ ఔట్ కాగా.. నితీశ్, అశ్విన్ (22) వేగం పెంచారు. కానీ స్టార్క్ పేస్, స్వింగ్ ముందు వీళ్లు నిలవలేకపోయారు. 39వ ఓవర్‌లో అశ్విన్‌తో పాటు హర్షిత్ రాణా (0)ను ఔట్ చేసిన స్టార్క్ చివర్లో నితీశ్‌ను కూడా దెబ్బకొట్టాడు. బుమ్రా (0)ను కమిన్స్ ఔట్ చేశాడు. ఓవరాల్‌గా ఇండియా 98 రన్స్ తేడాలో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 44.1 ఓవర్లలో 180 ఆలౌట్ (నితీశ్ రెడ్డి 42, కేఎల్ రాహుల్ 37, మిచెల్ స్టార్క్ 6/48).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 33 ఓవర్లలో 86/1
(మెక్‌స్వీని 38 బ్యాటింగ్,
లబుషేన్ 20 బ్యాటింగ్,
బుమ్రా 1/13).