గుళికల మందును చికెన్ మసాలా అనుకుని కూరలో కలపడంతో.. ఆ కూర తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఎ.ఎల్ పురం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన గోవిందమ్మ కుమార్తె ధనమ్మ పిల్లలు చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో ఉండే అమ్మమ్మ వద్దకు వెళ్లారు. మనవళ్లు రావడంతో సంతోషించిన వృద్ధురాలు గోవిందమ్మ పిల్లలకు చికెన్ వండిపెట్టింది. అయితే ఇంట్లో ఉన్న పురుగుల మందు గుళికలను చికెన్ మసాలా అనుకుని కూరలో కలిపి వండి పెట్టింది. పిల్లలతో కలసి తాను కూడా తినింది. కొద్దిసేపటికే ముగ్గురు కడుపులో వికారంతో అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితిని గుర్తించిన చుట్టుపక్కల వారు వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ఫలించక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వృద్ధురాలు గోవిందమ్మ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. గుడిపాల పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
