వెలుగు బిజినెస్ డెస్క్: రోజువారీ కొనుగోళ్లకు ఆన్లైన్ బిజినెస్‌ల వైపే ఎక్కువ మంది చూస్తుండటంతో రాబోయే అయిదేళ్లలో దేశంలోని కిరాణా షాపులు మరింత తగ్గుతాయని ఒక రిపోర్టు చెబుతోంది. కిరాణా షాపులకు ప్రస్తుతం 85 శాతం దాకా ఉన్న వాటా 2025 నాటికి 20 శాతం తగ్గి 65–70 శాతానికే పరిమితమవుతుందని మెకిన్సే రిపోర్టు వెల్లడించింది. ఈ–కామర్స్, మోడర్న్ ట్రేడ్ రిటెయిలర్లు కలిపి తమ వాటాను 30 శాతానికి పెంచుకోనున్నట్లు పేర్కొంది.
గ్రోసరీ మార్కెట్ గ్రోత్ 7 శాతం...
దేశంలో గ్రోసరీ మార్కెట్ 2025 దాకా సగటున 6 నుంచి 7 శాతం పెరుగుతుందని ఈ మెకిన్సే రిపోర్టు అంచనా వేస్తోంది. రాబోయే పదేళ్లలో గ్రోసరీ మార్కెట్ ఎదుగుదలకు తిరుగు లేదని చెబుతోంది. గ్రోసరీ మార్కెట్ మొత్తం పరిమాణం ఏటేటా పెరుగుతుందని, కిరాణా షాపుల సంఖ్య తగ్గినా ఉన్న వాటి వ్యాపారం బాగానే ఉంటుందని పేర్కొంటోంది. కాకపోతే, కిరాణా షాపుల మార్కెట్ వాటా మాత్రం తగ్గడం తథ్యమని అంచనా వేస్తున్నట్లు మెకిన్సే పార్ట్నర్ అభిషేక్ మల్హోత్రా చెప్పారు. రిలయన్స్ రిటెయిల్, డీమార్ట్, మోర్ వంటి మోడర్న్ ప్లేయర్లు, బిగ్‌బాస్కెట్,బ్లింకిట్ వంటి ఆన్లైన్ గ్రోసరీ కంపెనీలు తమ వాటాను భారీగా పెంచుకునే అవకాశాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ కంపెనీలే ఎక్కువ మార్కెట్ వాటా సాధిస్తాయని, కన్జూమర్లు ఆన్‌లైన్‌వైపే మళ్లుతున్నారని వివరించారు. ఆన్లైన్ బిజినెస్ కంపెనీలు భారీ విస్తరణ చేపడతాయని చెప్పారు.
1.2 కోట్ల కిరాణా షాపులున్నాయ్....
దేశంలోని గ్రోసరీ రిటెయిల్ మార్కెట్లో ఎక్కువ భాగం అన్ఆర్గనైజ్డ్గానే ఉంది. 1.2 కోట్ల రిటెయిల్(కిరాణా) షాపులు, మరో 10 లక్షల హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు దేశంలోని కన్జూమర్లకు సరుకులను చేరవేస్తున్నట్లు అభిషేక్ మల్హోత్రా చెప్పారు. గత పదేళ్లలో వాల్‌మార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి కంపెనీల రాకతో పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయని, కొత్త తరపు బీ2బీ ప్లేయర్ల రాకతో మొత్తం పద్దతులే మారిపోయాయని పేర్కొన్నారు. ఇండియాలో గ్రోసరీ రిటెయిల్ బిజినెస్ అనే పేరుతో మెకిన్సే ఈ రిపోర్టును తెచ్చింది. దేశంలోని కన్జూమర్ ప్రొడక్టు కంపెనీలు కూడా ఇందుకనుగుణంగా తమ డిస్ట్రిబ్యూషన్‌ను పటిష్టం చేసుకోవాలని, కొత్త చానెల్స్‌ను వినియోగించుకోవాలని ఈ రిపోర్టు సూచించింది. కరోనా రావడంతో దేశంలో డిజిటైజేషన్ ఊపందుకుంది. దీంతో అటు కంపెనీలు, ఇటు కన్జూమర్లు కూడా కొత్త ఫార్మాట్ల వైపు చూడటం ఎక్కువైంది. ఆన్లైన్లోని బీ2బీ వెంచర్లతో కంపెనీలు ఓవైపు జతకడుతుంటే, మరోవైపు కన్జూమర్లు గ్రోసరీలు కొనడానికి ఆన్లైన్ షాపింగే చేస్తున్నారు. తమకవసరమైన వస్తువలన్నింటినీ ఒకేచోట కొనడానికి దేశంలోని 60 శాతం మంది కన్జూమర్లు ఇష్టపడుతున్నారని మెకిన్సే రిపోర్టు తెలిపింది.
రంగంలోకి క్విక్ కామర్స్ కంపెనీలు
దేశంలోని చాలా కంపెనీలు గత ఏడాది కాలంగా బిజినెస్ పెంచుకునే ప్రయత్నాలు చురుగ్గా చేస్తున్నాయి. జెప్టో వంటి కొత్త క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఎక్స్‌ప్రెస్ గ్రోసరీ డెలివరీ బిజినెస్ (ఇన్‌స్టామార్ట్)లో 700 మిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు స్విగ్గీ కిందటి డిసెంబర్ నెలలో ప్రకటించింది. గ్రోసరీ డెలివరీ బిజినెస్లోని గ్రోఫర్స్ (ఇప్పుడు బ్లింకిట్) వంటి కంపెనీలు ఎంపిక చేసిన సిటీలలో క్విక్ డెలివరీ సర్వీసు తేనున్నట్లు ప్రకటిస్తున్నాయి. దేశంలోని 1,800 సిటీలకు తన గ్రోసరీ సర్వీసులను పెంచుతున్నట్లు ఈ వారంలోనే ఫ్లిప్‌కార్ట్ కూడా వెల్లడించింది. కాకపోతే, ఆన్లైన్ గ్రోసరీ కంపెనీల లాభదాయకత ఎక్కువగా ఉండకపోవచ్చని మెకిన్సే రిపోర్టు అభిప్రాయపడుతోంది. ఆఫ్‌లైన్ గ్రోసరీ వ్యాపారాల ఎబిటా 5 నుంచి 8 శాతం దాకా ఉంటే, మరోవైపు ఆన్లైన్ కంపెనీలు నష్టాలలో నడుస్తుండటాన్ని ప్రస్తావించింది. ఆన్లైన్ బిజినెస్‌లకు లాభాలు రావడానికి మరో మూడేళ్లు పట్టొచ్చని అభిషేక్ మల్హోత్రా చెప్పారు. కన్జూమర్లను చేజిక్కించుకోవడం పైనే ఆ కంపెనీలు ఇప్పుడు ఫోకస్ పెడుతున్నాయని పేర్కొన్నారు. జియోమార్ట్, వాల్‌మార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, బూకర్, ఎలాస్టిక్‌రన్, ఉడాన్ వంటి కొత్తతరపు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై పాతతరపు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లు గుర్రుగా ఉన్నాయి. కొత్తతరపు డిస్ట్రిబ్యూటర్లకు బెటర్ డీల్స్, బెటర్ మార్జిన్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇస్తున్నాయంటూ కిందటి నెలలో ఆల్ ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) అభ్యంతరాలు లేవనెత్తింది. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే కొన్ని సిటీలలో ఆయా కంపెనీల ప్రొడక్టులను బాయ్‌కాట్ చేయనున్నట్లు కూడా హెచ్చరించింది.
