తెలంగాణ ఉద్యమకారుల పేర్లుచరిత్రలో ఉండాలి

  • ఉద్యమంలో సమిధలైనోళ్ల కంటే రాజకీయ నాయకులకే ఎక్కువ పేరొచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి 
  • హైదరాబాద్ బుక్ ఫెయిర్​ను ప్రారంభించిన సీఎం 

ముషీరాబాద్, వెలుగు: సాయుధ రైతాంగ పోరాటంతో పాటు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ చరిత్ర కొంత వక్రీకరణకు గురైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమిధలైనోళ్ల కంటే రాజకీయంగా ప్రయోజనం పొందినోళ్లకే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల పేర్లు చరిత్రలో ఉండాలన్నారు. ‘‘చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదివితేనే కనుమరుగైన చరిత్ర తెలుస్తుంది. 

పోరాడి అమరులైనోళ్ల గురించి చరిత్రకారులు రాయాలి. గత పదేండ్ల నుంచి కొందరు తమకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే అసలైన చరిత్ర అని ప్రచారం చేస్తున్నారు” అని విమర్శించారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ పెరిగి డిజిటల్ మీడియా రావడంతో పుస్తకాల ప్రాధాన్యం తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి తరానికి తెలిసింది గూగుల్ మాత్రమేనని పేర్కొన్నారు. బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. చరిత్రకారులను గుర్తుంచుకోవడం కోసమే తెలంగాణ వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టామని తెలిపారు.