సోనీ, జీ ఇక ఒకటే!

సోనీ, జీ ఇక ఒకటే!
  • విలీనమవుతున్న కంపెనీలు..
  • దేశంలో అతిపెద్ద ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ నెట్‌‌వర్క్‌‌గా విలీన కంపెనీ
  • మెజార్టీ వాటా సోని చేతిలోనే..సీఈఓగా పునీత్‌‌ గోయంకానే
  • మార్కెట్‌‌లో కొనసాగనున్న  జీ-సోని మెర్జింగ్ కంపెనీ

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: దేశంలోని అతిపెద్ద ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ మీడియా హౌస్‌‌లు జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌,  సోనీ పిక్చర్స్‌‌ నెట్‌‌వర్క్స్‌‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌లు ఒక్కటవుతున్నాయి. దీంతో విలీన సంస్థ దేశంలో అతిపెద్ద ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌  సంస్థగా నిలవనుంది. సోనీ, జీ  మెర్జర్‌‌‌కు జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ బోర్డు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపింది. ఈ మెర్జర్‌‌‌కు ముందు  జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ టాప్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు, కంపెనీ షేరుహోల్డర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పునీత్‌‌ గోయంకాను కంపెనీ ఎండీ, సీఈఓ పదవుల నుంచి తొలగించాలని జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌లో అతిపెద్ద షేరు హోల్డర్‌‌‌‌గా ఉన్న ఇన్వెస్కో డెవలపింగ్‌‌ మార్కెట్స్‌‌ ఫండ్‌‌, ఓఎఫ్‌‌ఐ చైనా ఫండ్‌‌లు డిమాండ్ చేస్తున్నాయి.  ఈ టైమ్‌‌లోనే జీ, సోనీ కలిసి అతిపెద్ద ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ సంస్థగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన సంస్థలో జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌కు 47.07 శాతం వాటా దక్కుతుంది. సోనీ ఇండియాకు 52.93 శాతం వాటా దక్కుతుంది. ఈ కొత్త కంపెనీలో అదనంగా 1.575 బిలియన్ డాలర్ల (రూ. 11,655 కోట్ల) ను సోనీ ఇన్వెస్ట్ చేస్తుంది.  విలీన కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌‌లో కొనసాగుతుందని జీ ఎన్‌‌ఎస్‌‌ఈ ఫైలింగ్‌‌లో పేర్కొంది. ఇంకో మూడు నెలల్లో మెర్జర్‌‌ ప్రాసెస్‌‌ను పూర్తి చేయనున్నారు.  కొత్తగా ఏర్పడే సంస్థలో  మెజార్టీ వాటా సోనీకి దక్కడంతో జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ పేరు కూడా మారే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన కంపెనీ బోర్డులో మెజార్టీ డైరెక్టర్లను సోనీ నియమించుకోవడానికి వీలుకలుగుతుంది. 
మళ్లీ పునీత్ గోయంకానే...
పునీత్ గోయంకాను జీ  ఎండీ, సీఈఓ పదవుల నుంచి తొలగించాలని  డిమాండ్స్ వస్తున్నా, మెర్జర్‌‌‌ సంస్థకు ఆయన్నే ఎండీ,  సీఈఓగా కొనసాగించాలని సోనీ నిర్ణయించుకుంది.  ఈ రెండు కంపెనీలు తమ నెట్‌‌వర్క్‌‌లను, డిజిటల్ అసెట్లను (ఓటీటీలు), ప్రొడక్షన్ ఆపరేషన్స్‌‌ను, ప్రోగ్రామ్‌‌లను విలీనం చేస్తాయి.  ఇరు కంపెనీల ప్రమోటర్లు  నాన్‌‌ కాంపీట్‌‌ అగ్రిమెంట్‌‌కు అంగీకరించాయి. అంటే ఒక కంపెనీ ప్రమోటరు ఇంకో  కంపెనీకి పోటీగా బిజినెస్‌‌ను ఏర్పాటు చేయకూడదు. లిస్టెడ్ కంపెనీ ప్రమోటరు నాన్‌‌–కాంపీట్‌‌ అగ్రిమెంట్‌‌ను కుదుర్చుకోవడంపై సెబీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉందని  ఎనలిస్టులు చెబుతున్నారు. జీ–సోనీ మెర్జింగ్ ప్రపోజల్‌‌పై  కంపెనీ స్ట్రాటజిక్‌‌ రివ్యూని చేపట్టిందని జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ చైర్మన్‌‌ ఆర్ గోపాలన్ అన్నారు. షేరు హోల్డర్లకు, జీ కి ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
జీ షేర్లు 30 శాతం పైకి!
మెర్జింగ్ వార్తలతో జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ షేర్లు బుధవారం సెషన్‌‌లో దూసుకుపోయాయి. కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 35 శాతం పెరిగి రూ. 355 వద్ద ఆల్‌‌టైమ్‌‌ హైని టచ్ చేశాయి. చివరికి 30 శాతం లాభంతో రూ. 334 వద్ద క్లోజవ్వగా, జీ మార్కెట్ క్యాప్‌ రూ.33 వేల కోట్లను టచ్ చేసింది. 

వారంలోనే ఝున్‌‌ఝున్‌‌వాలాకు రూ.56 కోట్లు ప్రాఫిట్‌‌..
వారం రోజుల కిందటే జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ షేర్లు కొన్న రాకేష్ ఝున్‌‌ఝున్‌‌వాలా బుధవారం నాటికి 50 శాతం లాభాన్ని పొందగలిగారు. షేరు ధర రూ. 220.40 వద్ద 50 లక్షల షేర్లను ఆయన కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 110 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. బుధవారం నాటికి ఈ వాల్యు రూ. 166.15 కోట్లకు చేరుకుంది. అంటే వారంలోనే రూ. 56 కోట్ల ప్రాఫిట్ వచ్చిందన్నమాట. జీ ఎంటర్‌‌టైన్‌‌ టాప్ మేనేజ్‌‌మెంట్‌‌కు, కంపెనీ షేరు హోల్డర్లకు మధ్య గొడవ జరుగుతున్నప్పడు ఝున్‌‌ఝున్‌‌వాలా ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు.

అతిపెద్ద సంస్థగా జీ-సోనీ..
జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ దేశంలో 70 చానెల్స్‌‌ను  ఇంగ్లీష్‌‌, హిందీ, రీజినల్‌‌ లాంగ్వేజ్‌‌లలో ఆపరేట్ చేస్తోంది. అంతేకాకుండా గ్లోబల్ బ్రాడ్‌‌కాస్టింగ్‌‌ స్టూడియోలతో కలిసి వారి కంటెంట్‌‌ను ఇండియాలో స్ట్రీమింగ్ చేస్తోంది. సోనీ పిక్చర్స్‌‌ కూడా దేశంలో విస్తరించింది. కంపెనీ 24 ఛానెల్స్‌‌ను  సౌత్‌‌ ఏసియన్ మార్కెట్‌‌లో ఆపరేట్ చేస్తోంది.  ఇండియన్ ఐడల్‌‌, కౌన్ బనేగా కరోర్‌‌‌‌పతి వంటి ఫేమస్‌‌ షోలను సోనీ టెలికాస్ట్ చేసింది. నెట్‌‌ఫ్లిక్స్‌‌, అమెజాన్‌‌ ప్రైమ్‌‌వీడియో, డిస్నీ హాట్‌‌స్టార్‌‌‌‌కు పోటీగా జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ జీ5 ను,  సోనీ సోనీలైవ్‌‌  ఓటీటీలను ఆపరేట్ చేస్తున్న విషయం తెలిసిందే.  మెర్జర్‌‌ తర్వాత ఈ రెండు ఓటీటీలు కూడా కలుస్తాయి. దీంతో మెర్జర్‌‌ కంపెనీ  ఓటీటి మార్కెట్‌‌లో మరింత బలపడే అవకాశం ఉంటుంది. విలీనం వలన కొత్తగా ఏర్పడే సంస్థకు జీ కి ఉన్న బలం, సోనీకి ఉన్న బలం యాడ్ అవుతాయని, కొత్తగా ఏర్పడే సంస్థ ఇండియన్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ మార్కెట్‌‌లో దూసుకుపోతుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్‌‌ బ్రాడ్‌‌కాస్టింగ్‌‌, ఫిల్మ్ ప్రొడక్షన్‌‌లో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌  ఉంది. అలానే జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ రీజినల్‌‌గా బాగా విస్తరించింది. దీంతో మెర్జర్‌‌ సంస్థకు అడ్వాంటేజ్‌‌ ఉంటుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.