న్యూఢిల్లీ:మనదేశంలో ఈ ఏడాది ఇండ్ల ధరలు గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత వేగంతో పెరుగుతాయని తాజా స్టడీ వెల్లడించింది. అయితే, హోంలోన్లపై అధిక వడ్డీ రేట్ల వల్ల ఇండ్లను కొనడానికి జనం వెనకడుగు వేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా మొదటిసారి కొనుగోలు చేసేవారికి ధరలు పెద్ద అడ్డంకిగా మారుతారని రాయిటర్స్పోల్ తెలిపింది. కరోనా సమయంలో డిమాండ్ లేకపోవడం వల్ల భారతీయ ప్రాపర్టీ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోల్చితే స్తబ్దుగా ఉండిపోయింది. ఇతర మార్కెట్లలో మాత్రం అమ్మకాలు బాగా జరిగాయి. ఆ మార్కెట్లు ఇప్పుడు చల్లబడుతున్నాయి. టీకా రేట్లు మెరుగుపడటం, కరోనా కేసులు తగ్గడంతో చాలా మంది ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. దీంతో దేశమంతటా ఇండ్లకు పెంటప్ డిమాండ్ (ఒక్కసారిగా గిరాకీ పెరగడం) రావడం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు తిరిగి రెడీ కావడంతో ఆసియా ఇండ్ల మార్కెట్ చురుగ్గా ఉంది. ఇండ్ల ధరలు ఈ సంవత్సరం 7.5శాతం పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. 2024లో సగటు ధరలు 6 శాతం పెరుగుతాయని పేర్కొంది. ఆర్బీఐ ఈ నెల రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఇది 4.40శాతానికి పెరిగింది. త్వరలో మరోసారి రేట్ల పెంపు ఉంటుందనే భావిస్తున్నారు. ఇదే జరిగితే హోంలోన్లపై వడ్డీ ఇంకా ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ ఇండ్ల ధరలూ పెరుగుతాయని రాయిటర్స్ స్పష్టం చేసింది.
ఇన్పుట్ ఖర్చుల వల్లే..
లేబర్, స్టీల్ వంటి ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ఇండ్ల ధరలను పెంచడం తప్పనిసరి అవుతోందని జేఎల్ఎల్ రీసెర్చ్ డైరెక్టర్ రోహన్శర్మ అన్నారు. డిమాండ్ బాగుందని, బడా ఇన్వెస్టర్లూ ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్లకూ ఇబ్బందిలేదని వివరించారు. మొదటిసారిగా ఇల్లు కొనాలనుకునేవారికి ధరలు సమస్యగా మారుతాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది రెస్పాండెంట్లు స్పష్టం చేశారు. అద్దె ఇండ్లలోనే కొనసాగే అవకాశాలు ఉంటాయని అన్నారు. హోంలోన్ వడ్డీరేటు కనీసం ఒక పర్సంటేజ్ పాయింట్ పెరిగినా ధరలు భరించగలిగిన స్థాయి (అఫోర్డబిలిటీ) ఆరు శాతానిపైగా తగ్గుతుందని రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వివేక్ రాఠీ అన్నారు. రేట్లు ఆరు శాతం కంటే ఎక్కువ అయితే రెసిడెన్షియల్ మార్కెట్‌కు భారీ దెబ్బ తగుతుందని నైట్ ఫ్రాంక్, కొల్లియర్స్ , జేఎల్ఎల్ రీసెర్చ్, లియాసెస్ ఫోరాస్, ట్రూబోర్డ్ పార్ట్నర్స్ అంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సిమెంట్, స్టీల్ ధరలు మరింత పెరిగాయని చెప్పాయి. వీటికితోడు లేబర్కోసం కూడా ఇది వరకటి కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి అన్నారు. ఢిల్లీ, ముంబైలో ధరలు 4–5 శాతం మధ్య, బెంగళూరు, చెన్నైలో 5.5–6.5 శాతం వరకు పెరగొచ్చని చెప్పారు.
