ఒడిశా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై దర్యాప్తు అన్ని కోణాల్లోనూ కొనసాగుతోంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ సైతం విచారణ జరుపుతోంది. అయితే.. రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో బహనగ బజార్ స్టేషన్ మాస్టర్‌తో సహా మిగతా నలుగురు ఉద్యోగులు సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించినవారని, ప్రమాద సమయంలో వారు విధుల్లో ఉన్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఐదుగురు ఉద్యోగులు ప్రస్తుతం తమ విధులను నిర్వర్తిస్తున్నారని, రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) రూపొందించిన ప్రమాద దర్యాప్తు నివేదికపై భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే.. సిస్టమ్ మాన్యువల్ ట్యాంపరింగ్, ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఇంటరాలింగ్ సిస్టమ్‌లో లోపమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది కేంద్రంగా విచారణ జరుగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు.
త్వరలోనే సీఆర్‌ఎస్ నివేదిక రానుంది. ఉద్దేశపూర్వకంగా చేశారా..? అనుకోకుండా జరిగిందా..? ఏమైనా సాంకేతిక లోపంతో జరిగిందా..? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 288 మంది మృతి చెందారు. రైళ్ల సురక్షిత రాకపోకల విషయంలో కీలకమైన ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే ఈ దుర్ఘటన సంభవించినట్లు రైల్వేశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ క్రమంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) తన దర్యాప్తును ముమ్మరం చేశారు.
