కాంబినేషన్ ‌సవాల్‌!

కాంబినేషన్ ‌సవాల్‌!
  • ఒక్కో ప్లేస్‌ కు ఇద్దరేసి ప్లేయర్లు పోటీ
  • టీ20 సిరీస్‌ ముందు మేనేజ్‌ మెంట్‌ కు తలనొప్పి

టెస్టు సిరీస్‌‌లో ఇంగ్లండ్‌‌ను చిత్తు చేసి వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌నకు క్వాలిఫై అవ్వడంతో పాటు నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ అందుకొని ఫుల్‌‌ జోష్‌‌లో ఉన్న టీమిండియా ఇప్పుడు అదే టీమ్‌‌తో టీ20 సిరీస్‌‌కు రెడీ అవుతోంది..!  టెస్టుల మాదిరిగానే ఈ షార్ట్‌‌ ఫార్మాట్‌‌ వార్​లో  కోహ్లీసేనకు రెండు టార్గెట్స్‌‌ ఉన్నాయి..!     ఒకటి సిరీస్‌‌ అందుకోవడం.. రెండోది ఈ ఏడాది స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌నకు పక్కా టీమ్‌‌ను రెడీ చేసుకోవడం..! టీ20 మెగా టోర్నీకి ఇండియా ఈ సిరీస్‌‌తోనే  ప్రిపరేషన్స్‌‌ స్టార్ట్‌‌ చేయనుంది.!                         కానీ, ఈ సిరీస్‌‌లో ఫైనల్‌‌ ఎలెవన్‌‌ సెలెక్షన్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక్కో ప్లేస్‌‌కు  ఇద్దరేసి ప్లేయర్లు పోటీ పడుతున్నారు..!  ఓపెనింగ్‌‌ స్లాట్‌‌ కోసం శిఖర్‌‌ ధవన్‌‌, లోకేశ్‌‌ రాహుల్‌‌.. నాలుగో నంబర్‌‌కు శ్రేయస్‌‌ అయ్యర్‌‌, సూర్య కుమార్‌‌ మధ్య రేస్​ ఉంటే..  పేసర్ల కోటాలో భువనేశ్వర్‌‌కు దీపక్‌‌ చహర్‌‌ నుంచి పోటీ ఉంది!  ఇది మేనేజ్‌‌మెంట్‌‌కు తలనొప్పిగా మారింది..!

అహ్మదాబాద్‌‌‌‌:

ఇంగ్లండ్‌‌‌‌తో ఐదు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌కు ముందు ఇండియా టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌నకు ఈ సిరీస్‌‌‌‌తో ప్రిపరేషన్స్‌‌‌‌ మొదలు పెట్టనుంది టీమిండియా. శుక్రవారం  మొదలయ్యే ఈ  సిరీస్‌‌‌‌ కోసం సెలెక్టర్లు 19 మందిని ఎంపిక చేశారు. తుది జట్టులో కోసం ఒక్కో స్లాట్‌‌‌‌కు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. రాబోయే ఆరేడు నెలలను దృష్టిలో ఉంచుకొని పక్కా టీమ్‌‌‌‌ను తయారు చేయాలని భావిస్తున్న  కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి, బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ భరత్‌‌‌‌ అరుణ్‌‌‌‌కు ఇది సవాల్‌‌‌‌గా మారింది.  తొలుత సెటిల్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌తో వెళ్లి సిరీస్‌‌‌‌ నెగ్గిన తర్వాత ప్రయోగాలు చేస్తారా?  లేదా దూరదృష్టితో ఆలోచించి మొత్తం యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ను దించి వారి సత్తాను పరీక్షిస్తారా? అన్నది ఆసక్తి  కలిగిస్తోంది.  

రోహిత్‌‌‌‌కు జోడీ ఎవరు?

టీమిండియాకు భారీ ఫాలోయింగ్‌‌‌‌ దృష్ట్యా  టీమ్‌‌‌‌కు ఫలితాలే ముఖ్యం. స్వదేశంలో ఆడుతున్నప్పుడు మన టీమ్‌‌‌‌ కచ్చితంగా గెలవాలనే అంతా ఆశిస్తారు.

అన్ని మ్యాచ్‌‌‌‌లు ఒకే  వేదికపై  దాదాపు ఒకే రకమైన ట్రాక్స్‌‌‌‌పై జరుగుతాయి కాబట్టి తొలి మూడు మ్యాచ్‌‌‌‌లకు సెటిల్డ్‌‌‌‌ టీమ్‌‌‌‌నే బరిలోకి దింపుతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, టెస్టుల్లో అదరగొట్టడంతో రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ను టీ20లోకి తీసుకున్నారు.  తను సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండడంతో  టాపార్డర్‌‌‌‌లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో మొన్నటిదాకా ఫస్ట్‌‌‌‌ చాయిస్‌‌‌‌ కీపర్‌‌‌‌గా ఉన్న కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ఇప్పుడు కీపింగ్‌‌‌‌ బాధ్యతలు పంత్‌‌‌‌కే అప్పగించాల్సి ఉంటుంది.  వైట్‌‌‌‌బాల్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌, రోహిత్‌‌‌‌ శర్మ ఓపెనర్లుగా కుదురుకున్నప్పటికీ షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో స్పెషలిస్ట్‌‌‌‌గా రాహుల్‌‌‌‌ మంచి పేరు తెచ్చుకోవడంతో ఓపెనింగ్‌‌‌‌ స్లాట్‌‌‌‌  రేసు రసవత్తరంగా మారింది.  ఓ ఓపెనర్‌‌‌‌గా రోహిత్‌‌‌‌  ఉండడం పక్కా. దాని గురించి చర్చే  అనవసరం. కానీ, ఇంకో స్లాట్‌‌‌‌ కోసం  ధవన్‌‌‌‌కు రాహుల్‌‌‌‌కు మధ్య గట్టి పోటీ నెలకొంది. విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో ఢిల్లీకి ఆడిన ధవన్ ఓ మ్యాచ్‌‌‌‌లో 150 ప్లస్‌‌‌‌ స్కోరు చేసి ఫామ్‌‌‌‌ అందుకున్నాడు. మరోవైపు  ఐపీఎల్‌‌‌‌లో అదరగొట్టిన లోకేశ్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉన్నాడు.  ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో గాయపడిన అతను పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించి మళ్లీ టీమ్‌‌‌‌లో చేరాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌‌‌‌లో  ఓపెనర్‌‌‌‌గా రాణించిన రాహుల్‌‌‌‌ను ఏ బాధ్యత అప్పగిస్తారు?  ధవన్‌‌‌‌ ఆట మిడిలార్డర్‌‌‌‌కు సూట్‌‌‌‌ కాదు కాబట్టి లోకేశ్‌‌‌‌ను మిడిలార్డర్‌‌‌‌కు పంపిస్తారా?  అన్నది తేల్చుకోవాల్సి ఉంటుంది.

భువీకి అంత ఈజీ కాదు

నాలుగో నంబర్‌‌‌‌ మాదిరిగానే బౌలింగ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో  భువనేశ్వర్‌‌‌‌, దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ మధ్య పోటీ ఏర్పడింది.  ఒకప్పుడు వైట్‌‌‌‌బాల్‌‌‌‌లో  ఇండియా బెస్ట్‌‌‌‌  పేసర్‌‌‌‌గా పేరు తెచ్చుకున్న భువీ గాయాల కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. గత ఐపీఎల్‌‌‌‌లో గాయపడిన భువీ కోలుకున్నాడు. లాంగ్‌‌‌‌ గ్యాప్‌‌‌‌ తర్వాత మళ్లీ టీమ్‌‌‌‌లోకి వచ్చాడు. అయితే, తుదిజట్టులో అతనికి చోటు అంత సులభంగా దక్కేలా లేదు. యంగ్‌‌‌‌ పేసర్లు దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ నుంచి పోటీ ఎదుర్కోక తప్పడం లేదు.  ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌, డెత్‌‌‌‌ ఓవర్లలో బెటర్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా చహర్‌‌‌‌తో పోల్చితే భువీకే మొగ్గు ఉంది. కానీ, ముస్తాక్‌‌‌‌ అలీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌‌‌‌లు తప్పితే అతను ఈ మధ్య పెద్దగా క్రికెట్‌‌‌‌ ఆడింది లేదు. ఇక, మంచి ఔట్‌‌‌‌స్వింగ్‌‌‌‌ బౌలర్‌‌‌‌ అయినప్పటికీ ఎక్కువ వేరియేషన్స్‌‌‌‌ లేకపోవడం దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌కు ప్రతికూలంగా మారింది. మరోవైపు ఈ ఇద్దరికంటే  శార్దూల్‌‌‌‌ మంచి పేస్‌‌‌‌తో పాటు స్వింగ్‌‌‌‌ కూడా రాబట్టగలడు. లాంగ్‌‌‌‌ టర్మ్‌‌‌‌ ప్రయోజనాల దృష్ట్యా  ఈ సిరీస్‌‌‌‌లో ఠాకూర్‌‌‌‌కు చాన్స్ ఇస్తే మంచిదే. కానీ అందుకోసం సీనియర్‌‌‌‌ భువీ, టాలెంటెడ్‌‌‌‌ దీపక్‌‌‌‌ను పక్కనబెట్టే సాహసం మేనేజ్‌‌‌‌మెంట్ చేస్తుందా? అన్నది తేలాలి.  సెకండ్‌‌‌‌ పేసర్‌‌‌‌ కోసం యంగ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌ తంగరసు నటరాజన్‌‌‌‌, నవదీప్‌‌‌‌ సైనీ పోటీ పడుతున్నారు. వైవిధ్యమైన యార్కర్స్‌‌‌‌తో బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌కు సవాల్‌‌‌‌ విసిరే సత్తా ఉన్న  నట్టూనే ఫేవరెట్‌‌‌‌గా కనిపిస్తున్నాడు. స్టార్టింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో సైనీ కంటే నట్టూ వైపే మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ మొగ్గు చూపొచ్చు.

కిషన్‌‌‌‌, తెవాటియాకు కష్టమే

స్పిన్‌‌‌‌కు అనుకూలించే మొతెరా ట్రాక్‌‌‌‌పై ముగ్గురు స్పిన్నర్లుగా యజ్వేంద్ర చహల్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ తుది జట్టులో ఉండడం ఖాయమే.  టీ20 టీమ్‌‌‌‌ నుంచి తొలిసారి పిలుపు అందుకున్న ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, రాహుల్‌‌‌‌ తెవాటియా ప్రస్తుతానికి ఫైనల్​ ఎలెవన్​లో  ఎక్కడా ఫిట్‌‌‌‌ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎవరైనా గాయపడితేనో, ఎవరికైనా రెస్ట్ ఇస్తేనో తప్ప తుది జట్టులో ఈ ఇద్దరికీ  చాన్స్ ఉండబోదు.  ఇక, ముగ్గురు సీనియర్‌‌‌‌, టాలెంటెడ్‌‌‌‌ ప్లేయర్లు ఈ సిరీస్‌‌‌‌లో లేరు. మహ్మద్‌‌‌‌ షమీ, రవీంద్ర జడేజా గాయాల నుంచి కోలుకుంటుండగా, జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రాకు రెస్ట్‌‌‌‌ ఇచ్చారు. ఈ ముగ్గురూ తిరిగొస్తే  ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ ఎంపిక మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు మరింత స్వీట్‌‌‌‌ హెడేక్‌‌‌‌ కానుంది.

రాహుల్‌‌x అయ్యర్‌‌x సూర్య

ఓపెనింగ్‌‌ కాంబినేషన్‌‌పై  క్లారిటీ ఇస్తే నాలుగో నంబర్‌‌పై చర్చ మొదలవుతుంది. కెప్టెన్‌‌ కోహ్లీ మూడో  నంబర్‌‌లో  దిగుతాడు. ఇద్దరు గేమ్‌‌ చేంజర్స్‌‌ అయిన కీపర్‌‌ పంత్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా లను  ఐదు, ఆరో నంబర్‌‌లో ఆడిస్తే  రాహుల్‌‌కు నాలుగో నంబర్‌‌లో మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ, ఆ ప్లేస్‌‌ కోసం ఇప్పటికే శ్రేయస్‌‌ అయ్యర్‌‌, కొత్తగా టీమ్‌‌లోకి వచ్చిన సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ మధ్య గట్టి పోటీ ఉంది. తనకు వచ్చిన అవకాశాలను అయ్యర్‌‌ వృథా చేయలేదు కాబట్టి  తుదిజట్టులో చోటు కోసం సూర్యకుమార్‌‌ కొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఉంది.  అయితే, ఈ బెర్తు కోసం రాహుల్‌‌, శ్రేయస్‌‌, సూర్య ముగ్గురి మధ్య పోటీ ఏర్పడితే మాత్రం కర్నాటక బ్యాట్స్‌‌మన్‌‌కే ఎక్కువ మొగ్గు ఉంది. ఎందుకంటే ముంబై ప్లేయర్లు అయ్యర్‌‌, సూర్య కంటే లోకేశ్‌‌ మంచి స్ట్రోక్స్‌‌ ఆడగలడు, వెంటనే గేర్లు మార్చి దూకుడుగా ఆడగలడు. కాబట్టి ధవన్‌‌ను ఓపెనర్‌‌గానే కంటిన్యూ చేస్తే.. అయ్యర్‌‌, సూర్యను కాదని రాహుల్‌‌ను నాలుగో నెంబర్‌‌లో పంపిస్తారేమో చూడాలి.