కేటీఆర్ క్వాష్ పిటిషన్‎పై హైకోర్టులో విచారణ స్టార్ట్.. వాడివేడీగా వాదనలు

హైదరాబాద్: ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‎పై తెలంగాణ హై కోర్టులో వాదనలు వాడీ వేడీగా సాగుతున్నాయి. కేటీఆర్ తరుఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తుండగా.. ఏసీబీ తరుఫున పీపీ వాదిస్తున్నారు. అసలు ఈ కేసులో కేటీఆర్ పై అభియోగాలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఫార్మూలా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించడంతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిందని పీపీ కోర్టుకు వివరించారు. 

అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత సెక్షన్ల  కింద కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. ఐఏఎస్ అధికారి దాన కిశోర్ ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిందని పీపీ న్యాయస్థానానికి వెల్లడించారు. మరీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చారా అని పీపీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎఫ్ఈవో వివరాలను కేటీఆర్ తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే కోర్టుకు వివరిస్తున్నారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఫార్మూలా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఫార్మూలా ఈ కార్ రేసింగ్ ఇష్యూపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. అప్పటి మంత్రి కేటీఆర్ ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించారని కేటీఆర్‎పై అభియోగాలు మోపింది. ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించారు. 

ఫార్మూలా ఈ కార్  రేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్  పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై మంగళవారం (డిసెంబర్ 31) హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో 2024, డిసెంబర్ 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో (మంగళవారం) నాట్ టు అరెస్ట్ ఉత్తర్వుల గడువు ముగియనుండటంతో ఏసీబీ నెక్ట్స్ స్టెప్‎పై ఉత్కంఠ నెలకొంది.