అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. జనవరి 3కి తీర్పు వాయిదా

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‎ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‎పై విచారణ ముగిసింది. ఈ కేసులో అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‏పై నాంపల్లి కోర్టులో సోమవారం (డిసెంబర్ 30) విచారణ జరిగింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‎పై  చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం దీనిపై వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ తరఫున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరుఫున వాదించిన పీపీ.. బన్నీ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయాలని కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. బన్నీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‎పై తీర్పును 2025, జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్‎ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 ముద్దాయిగా చేర్చారు. ఈ క్రమంలోనే 2024, డిసెంబర్ 13న బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. అల్లు అర్జున్‎కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ అల్లు అర్జున్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించాడు. 

హైకోర్టు అల్లు అర్జున్‎కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని బన్నీకి హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచన మేరకు అల్లు అర్జున్ శుక్రవారం (డిసెంబర్ 27) నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ  పిటిషన్‎పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. 

Also Read : పవన్ ని కలసిన దిల్ రాజు

సోమవారం (డిసెంబర్ 30) చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‎పై కౌంటర్ దాఖలు చేయగా.. దీనిపై వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. బన్నీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‎పై తీర్పును 2025, జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ప్రస్తుతం హైకోర్టు మంజూరు చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్‎పై బయట ఉన్న బన్నీకి.. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ వస్తుందా.. రాదా..? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరీ ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ వస్తుందో రాదో తెలియాలంటే జనవరి 3వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.