- రెజ్లింగ్‌లో వినేశ్, రవి, నవీన్‌కు స్వర్ణాలు
- పూజ గెహ్లాట్, పూజ సిహాగ్, దీపక్‌కు బ్రాంజ్ మెడల్స్
- అథ్లెటిక్స్‌లో అవినాశ్, ప్రియాంకాకు సిల్వర్
- బాక్సింగ్‌లో హుస్సాముద్దీన్, జాస్మిన్‌కు బ్రాంజ్
కామన్వెల్త్‌లో ఇండియన్ అథ్లెట్ల పతకాల పంట పండుతోంది..! మొన్న ఒకే రోజు ఆరు మెడల్స్‌తో మెరిసిన రెజ్లర్లు.. నిన్న మూడు గోల్డ్, మూడు బ్రాంజ్ మెడల్స్‌తో అదరహో అనిపించారు..! దీనికి తోడుగా అథ్లెటిక్స్‌లో అవినాశ్, ప్రియాంకాతో పాటు లాన్ బౌల్స్ టీమ్ సిల్వర్ కాంతులు పూయించింది..! బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్, జాస్మిన్ కాంస్య పతకాలను సాధించారు..! మిగతా క్రీడాంశాల్లోనూ ఇతర అథ్లెట్లు పతకాలు ఖాయం చేసుకుని త్రివర్ణాన్ని రెపరెపలాడించేందుకు సిద్ధమవుతున్నారు..! తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పంచ్‌కు అడుగు దూరంలో నిలవగా, బ్యాడ్మింటన్‌లోనూ మనోళ్లు సూపర్ షో చేశారు..!!
బర్మింగ్‌హామ్: ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్.. కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన విమెన్స్ 53 కేజీల ఫైనల్లో వినేశ్ 4–0తో (విన్నింగ్ బై ఫాల్) చమోదయ కేశిని ముదురవాలగే (శ్రీలంక)పై గెలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా గేమ్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ సాధించిన తొలి ఇండియన్ రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. 2014, 2018లోనూ వినేశ్ స్వర్ణాలు సాధించింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత మానసిక, శారీరక సమస్యలతో ఇబ్బందులుపడ్డ వినేశ్ ఫామ్ కోల్పోయింది. దీంతో గేమ్స్‌లో పతకం సాధిస్తుందనే నమ్మకం కూడా లేని దశ నుంచి ఒక్కో ప్రత్యర్థిని చిత్తు చేస్తూ సంచలన విజయాలు సాధించింది. విమెన్స్ 50 కేజీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో పూజా గెహ్లాట్ 12–2తో క్రిస్టెల్లీ లిమోఫోక్ (స్కాట్లాండ్)పై గెలిచి పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీస్‌లో పూజ 6–9తో మాడిసన్ బినాకా పార్క్స్ (కెనడా) చేతిలో ఓడటంతో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. విమెన్స్ 76 కేజీల ప్లే ఆఫ్ బౌట్‌లో పూజ సిహాగ్ 11–0తో నవోమి డీ బ్రూనీ (ఆస్ట్రేలియా)పై గెలిచి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది..
డెబ్యూలోనే గోల్డ్
మెన్స్ 57 కేజీల ఫైనల్లో రవికుమార్ దహియా 10–0తో ఎబికెవినిమో వెల్సన్ (నైజీరియా)ను ఓడించి గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. ఫైనల్ చేరే క్రమంలో రవి.. సూరజ్ సింగ్ (న్యూజిలాండ్), అసద్ అలీ (పాకిస్తాన్)పై టెక్నికల్ సుపీరియారిటీతో నెగ్గాడు. టైటిల్ ఫైట్‌లో నైజీరియన్ నుంచి గట్టిపోటీ ఎదురైనా, రవి రైట్‌లెగ్ ఫోల్డింగ్ అటాక్‌తో పైచేయి సాధించాడు. సెకండ్ కౌంటర్ అటాక్‌లో టేక్ డౌన్ మూవ్‌తో వెల్సన్‌ను పడగొట్టాడు. మెన్స్ 74 కేజీల ఫైనల్లో నవీన్ కుమార్ 9–0తో మహ్మద్ షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలిచి స్వర్ణం పట్టాడు. మ్యాట్‌పై ప్రత్యర్థిని ఓ పట్టు పట్టిన నవీన్.. వరుసగా 2, 7 పాయింట్లు సాధించాడు. మెన్స్ 97 కేజీ బ్రాంజ్ బౌట్‌లో దీపక్ నెహ్రా 10–2తో తయాబ్ రజా (పాకిస్తాన్)పై గెలిచి మెడల్‌ను సాధించాడు.
