కుటుంబ సర్వే 98 శాతం కంప్లీట్​

  • కొన్నిచోట్ల వంద శాతానికి మించి​
  • ప్రారంభమైన సర్వే కంప్యూటరీకరణ
  • 856 కంప్యూటర్ల సమీకరణ
  • వెయ్యి మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కటుంబ సర్వే స్పీడ్​గా సాగుతోంది. సర్వే చివరి దశకు చేరుకోవడంతో డాటా ఎంట్రీ మొదలైంది. కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్​లతో వెయ్యి మంది ఆపరేటర్లు స్పీడ్​గా డాటా ఎంట్రీ చేస్తున్నారు. ప్రజల 'సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల' సమగ్ర ముఖచిత్రం ఆవిష్కరించడానికి ప్రభుత్వం సర్వే మొదలు పెట్టింది. ఇందుకోసం పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. 

కుటుంబాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన సంఖ్య కోసం ఈనెల 6న స్టిక్కరింగ్ మొదలుపెట్టి, 9 నుంచి సర్వేను ప్రారంభించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో 2.04 లక్షల కుటుంబాలు ఉండగా, ఆ సంఖ్య 2,47,354కు పెరిగిందని తొలుత అంచనా వేశారు. స్టిక్కరింగ్, సర్వేతో 2,60,559 కుటుంబాలకు చేరిందని తేలింది. సర్వే ముగిసేలోగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. 

స్పీడ్​గా సర్వే..

కుటుంబాల సమగ్ర వివరాలను ఎన్యుమరేటర్లు తెలుసుకుంటూ స్పీడ్​గా నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికే 98 శాతం సర్వే నిర్వహించారు. కొన్ని మండలాల్లో 100 శాతం దాటింది. అయితే సర్వేను తొందరగా ముగించుకోవాలన్న ఉద్దేశంతో కొందరు ఎన్యుమరేటర్లు ప్రభుత్వం రూపొందించిన అన్ని ప్రశ్నలను అడగడం లేదని తెలుస్తోంది. కుటుంబం వద్దకు వెళ్లి పేర్లు, ఆధార్, రేషన్ కార్డు, ల్యాండ్​తోపాటు కులం, ఉపకులం గురించి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. 

కొందరు మాత్రం తమ ఆస్తులు వివరాల గురించి ప్రస్తావించకుండా అప్పులు వివరాలను చెబుతున్నారు. అయితే సర్వే ఫారంలోని మిగిలిన ప్రశ్నలకు కొందరు ఎన్యుమరేటర్ సొంతంగానే ఆన్సర్ రాసుకొని, సంతకం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అభివృద్ధితోపాటు స్కీమ్స్​రూపకల్పన కోసం సమగ్ర సర్వే చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. 

ప్రారంభమైన డాటా ఎంట్రీ..

యాదాద్రి జిల్లాలో సర్వే చివరి దశకు చేరుకున్నది. జిల్లాలో 2,60,559 కుటుంబాల ఉండగా, ఇప్పటివరకు 2.50 లక్షలకు పైగా కుటుంబాలను సర్వే చేశారు. జిల్లావ్యాప్తంగా 98 శాతం సర్వే జరగగా, బొమ్మలరామారం, పోచంపల్లి, మోటకొండూరు సహా కొన్ని మండలాల్లో ఇప్పటికే వంద శాతం దాటింది. సర్వే వివరాలను ఎంటర్​చేయడం కోసం ప్రభుత్వాఫీసుల్లోని కంప్యూటర్లతోపాటు అదనంగా మరో 856 కంప్యూటర్లను ప్రొవైడ్ చేశారు. వెయ్యి మందికి పైగా ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్ రోజుకు 25 కుటుంబాల వివరాలను అప్​లోడ్​ చేయాల్సి ఉంటుంది. కాలేజీలు ఎంపీడీవో ఆఫీసుల్లో డేటా ఎంట్రీ కొనసాగుతోంది. 

సర్వే కోసం జిల్లాకు రూ.కోటికి పైగానే..

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.కోటికి పైగానే ఖర్చు చేస్తోంది. ఉదాహారణకు యాదాద్రి జిల్లాకు సంబంధించి 2,60,559 కుటుంబాల ఉండగా, సర్వే కోసం స్టిక్కర్ల తయారీ, స్టేషనరీని సమకూర్చుకున్నారు. డాటా ఎంట్రీ కోసం ఆపరేటర్లను నియమించుకున్నారు. ఎన్యుమరేటర్లు అందించిన కుటుంబ సర్వేను ఆన్​లైన్​లో ఎంట్రీ చేస్తున్నారు. ఒక్కో కుటుంబ వివరాలను ఆన్​లైన్ చేయడానికి రూ.30 చొప్పున ఆపరేటర్​కు చెల్లిస్తారు. ఈ లెక్కన ఆపరేటర్లకే రూ.70 లక్షలకు పైగానే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో జిల్లాకు రూ. కోటికి పైగానే ఖర్చు చేయాల్సి వస్తోంది.