యువత భవితపై బీఆర్ఎస్ కుట్ర

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు  వ‌చ్చిన  కొలువులే  త‌ప్ప తెలంగాణ బిడ్డలకు ఒరిగిందేం లేదు.   పేప‌ర్ లీకేజీలు, కోర్టు కేసుల‌తో నిరుద్యోగ యువ‌త ప్రాణాల‌తో  కేసీఆర్ కుటుంబ స‌భ్యులు చెల‌గాట‌మాడారు.  ఒక్క పోటీ  ప‌రీక్ష  కూడా రాయ‌కుండానే  లక్షలాది మంది  ప్రభుత్వ ఉద్యోగ అర్హతకు అవ‌స‌ర‌మైన వ‌య‌స్సును కోల్పోయారు.  దీంతో  క‌డుపుమండిన యువ‌త ఆ కుటుంబం కొలువుల‌ను ఊడ‌గొట్టి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌ట్టారు.  సీఎం రేవంత్ రెడ్డి  బాధ్యతలు  స్వీక‌రించిన  త‌ర్వాత  నియామ‌కాలనే  నినాద‌పు  విత్తనాలు  తెలంగాణ అంతటా  కొలువుల  రూపంలో  మొల‌క‌లెత్తుతున్నాయి. ప‌ది నెల‌ల కాలంలోనే  30 వేల మంది పైగా  కొత్త కొలువుల్లో చేర‌డంతో ఆయా కుటుంబాల్లో  కొత్త కాంతులు  ప్రసరిస్తున్నాయి. ఆ వెలుగుల‌ను  జీర్ణించుకోలేని  కేసీఆర్‌,  కేటీఆర్‌,  హ‌రీష్ రావు యువ‌త భ‌విత‌కు  గ్రహణం ప‌ట్టేలా నిత్యం కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను తెలంగాణ యువ‌త‌.. మ‌రీ ముఖ్యంగా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలకు చెందిన యువ‌తరం అర్థం చేసుకుని తిప్పికొట్టాల్సిన స‌మ‌యం ఇది. 

కేసీఆర్  ప‌దేండ్ల పాల‌నా కాలంలో ఒక్కసారంటే  ఒక్కసారి కూడా గ్రూప్‌-1 ప‌రీక్షలు నిర్వహించలేదు.  స‌మైక్య రాష్ట్రంలో మ‌న కొలువుల‌న్నీ ఆంధ్రోళ్లు కొల్లగొట్టుకుపోతున్నార‌ని నిత్యం విమ‌ర్శించిన పెద్ద మ‌నిషి.. ఎందుకు త‌న హ‌యాంలో  ఒక్కసారి కూడా  గ్రూప్‌-1 ప‌రీక్షలు సక్రమంగా  నిర్వహించలేదు    కేసీఆర్​ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎనిమిదేండ్ల త‌ర్వాత 2022లో ఒకే ఒక్క గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌ను బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇచ్చింది.  ఒక‌సారి పేప‌ర్ల లీకుతో ప‌రీక్ష ర‌ద్దు కాగా,  మ‌రోసారి బ‌యోమోట్రిక్ విధానంపై  హైకోర్టు ఆ ప‌రీక్షను  ర‌ద్దు చేసింది.  మీరు ఇచ్చిన నోటిఫికేష‌న్‌లో నిబంధ‌న‌లు మీరే పాటించ‌క‌పోతే ఎలా అని నాడు హైకోర్టు ప్రశ్నిస్తే... అస‌మ‌ర్థతకు నిదర్శనంగా నిలిచిన నాటి టీజీపీఎస్సీ నిబంధ‌న‌లు మార్చుకోవ‌డం మా ఇష్టం అంటూ అర్థంలేని స‌మాధానం ఇచ్చింది.

  నిబంధ‌న‌ల మార్పు స‌రికాదంటూ గౌర‌వ హైకోర్టు  ఆ ప‌రీక్షనే  ర‌ద్దు చేసింది. ఆట ప్రారంభానికి ముందే నిబంధ‌న‌లు రూపొందించాలి.. ఆట ప్రారంభ‌మైన త‌ర్వాత ఆ నిబంధ‌న‌లు మార్చుకుంటే అవి చ‌ట్టపరంగా నిల‌బ‌డ‌వు.  నోటిఫికేష‌న్‌లోని నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా  ముందుకు సాగాల‌ని  రేవంత్ ప్రభుత్వంపై  ఒత్తిడి పెంచేందుకు గ్రూప్‌-1కు   ప్రిపేర్ అయిన విద్యార్థుల‌ను బీఆర్ఎస్​ రెచ్చగొట్టింది.  బీఆర్ఎస్ ప‌న్నిన ఉచ్చులో అభ్యర్థులు కొంత‌మేర చిక్కుకు న్నారు. అయితే,  హైకోర్టు  మొద‌లు సుప్రీంకోర్టు వ‌ర‌కు ప‌రీక్షల‌ ర‌ద్దుకు నిరాక‌రించ‌డంతో ఇప్పుడు గ్రూప్ -1 ప‌రీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

పది నెలల్లోనే 11వేలకు పైగా ఉపాధ్యాయ కొలువుల‌ భ‌ర్తీ

బీఆర్ఎస్​ హయాంలో   కేటీఆర్  ఉద్యమాల  పురిటి గ‌డ్డ  ఉస్మానియా యూనివ‌ర్సిటీ వైపు తిరిగి చూడ‌లేదు.  అశోక్ న‌గ‌ర్  ఎటుందో  ఆ స‌మ‌యంలో  కేటీఆర్‌కు, హ‌రీష్​రావుకు తెలియ‌దు.  ఎన్నిక‌ల ముందు త‌మ కొలువుల‌ను నిరుద్యోగులు ఊడ‌గొడ‌తార‌నే సోయి వ‌చ్చి హ‌డావుడిగా ఇష్టాగోష్టి జ‌రిపారు.  వారి కాళ్ల ద‌గ్గర  కూర్చొని  ఫొటోల‌కు ఫోజులు ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే అశోక్ న‌గ‌ర్‌లో అంద‌రినీ క‌లుస్తానంటూ ప‌దేండ్ల పాపాల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్రయత్నం  చేశారు.  కానీ,  చేసిన మోసాన్ని  గుర్తించిన  నిరుద్యోగులు ఎన్నిక‌ల్లో  క‌ర్రు కాల్చి వాత‌పెట్టారు.  ప‌దేండ్ల  పాల‌నా కాలంలో  బీఆర్ఎస్ పాల‌కులు ఇచ్చింది బొటాబొటిగా 8 వేల ఉపాధ్యాయ కొలువులు.  సీఎం  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని  ప్రజాప్రభుత్వం ఏర్పడిన ప‌ది నెల‌ల్లోపే 11,062 ఉపాధ్యాయ కొలువుల‌ను భ‌ర్తీ చేసింది. కేజీ టూ పీజీ అంటూ ఊద‌ర‌గొట్టిన కేసీఆర్ ఒక్క స్కూల్‌నూ ఏర్పాటు చేయ‌ని విష‌యం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు.  గ్రూప్‌-1, ఉపాధ్యాయ నియామ‌కాలే కాదు.  ఏ ఉద్యోగాల విష‌యంలోనూ కేసీఆర్ ప్రభుత్వం  చిత్తశుద్ధితో ప‌ని చేయ‌లేదు.  ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో  చెప్పిన కేసీఆర్‌.. తాను ఎప్పుడూ అలా చెప్పలేదని శాస‌న‌ స‌భ‌లో అడ్డంగా వాదించారు.  కేసీఆర్ ద్వంద్వ నీతికి ఆ రెండు ప్రకటనలే నిదర్శనం. 

బీఆర్​ఎస్​ డ్రామాలు 

పదేండ్ల పాలనలో ఉద్యోగాలు ఇవ్వడంలో విఫ‌ల‌మైన బీఆర్ఎస్ నాయ‌కులు ఇప్పుడు నిరుద్యోగుల‌కు తాము అండ‌గా ఉంటామన‌డం  దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే ఉంది.  వ‌రుస నోటిఫికేష‌న్లు, నియామ‌కాల‌తో యువ‌త ఉన్నతికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై   కేటీఆర్‌,  హ‌రీష్​రావు, బీఆర్ఎస్  నాయ‌కులు  కుట్రలకు పాల్పడుతున్నారు.  యువ‌త  జీవితాల‌తో  చెల‌గాట‌మాడుతున్నారు.  ఉద్యమ  స‌మ‌యం లోనూ యువ‌త‌ను రెచ్చగొట్టి  వారి ప్రాణాల‌ను బ‌లిగొన్నారు.  ఇప్పుడు అదే  డ్రామాను  హ‌రీష్​రావు,  కేటీఆర్  కొన‌సాగిస్తున్నారు. 

రాజ‌కీయ కాల‌కేయులు

 ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఊద‌ర‌గొట్టిన బీజేపీ నాయ‌కులు ఇప్పుడు దానిపై నోరు మెద‌ప‌డం లేదు.  కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ఏకంగా అశోక్ న‌గ‌ర్‌కు వెళ్లి గ్రూప్‌-1 అభ్యర్థులను రెచ్చగొట్టారు.  కేంద్రంలో బీజేపీ ప‌దేండ్ల పాల‌నా కాలంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు.. అందులో తెలంగాణవారు ఎంద‌రో  బండి సంజ‌య్ చెప్పాలి.   నీట్​పరీక్ష నిర్వ హణలో  మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2016లో ఇండియ‌న్ మెడిక‌ల్ యాక్ట్​కు 10-D  స‌వ‌ర‌ణ చేసింది. ఈ స‌వ‌ర‌ణ‌తో ఓబీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు  దక్కకుండా పోయాయి. ఈ దుర్మార్గంతో 2017 నుంచి ఇప్పటివ‌ర‌కు దాదాపు 11 వేల‌ మందికిపైగా ఓబీసీ విద్యార్థులు నష్టపోయారు.  దీనిపై కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ వైఖ‌రి ఏమిటో స్పష్టం చేయాలి. అపోహ‌లు సృష్టించి,  భ‌యాందోళ‌న‌లు క‌లగ‌జేసి యువ‌త ప్రాణాలు బ‌లిగొనేందుకు బీఆర్ఎస్, బీజేపీ నాయ‌కులు రాజ‌కీయ కాల‌కేయుల్లా మారారు.  ఈ కాల‌కేయుల‌కు దూరంగా ఉండి ప్రజా ప్రభుత్వానికి యువ‌త మద్దతుగా నిలవాలి.  శ్రద్ధగా ప్రిపేర్ అయి ప్రభుత్వ కొలువులు సాధించాలి.

ప్రజాప్రభుత్వంలో భారీగా ఉద్యోగాల భర్తీ

 రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన మరుక్షణం నుంచే ఉద్యోగ నియామ‌కాల‌పై దృష్టి సారించింది. దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చిన ఫైల్‌పైనే సీఎం రేవంత్​ తొలి రోజు సంతకం చేశారు.  కేవ‌లం ప‌ది నెల‌ల కాలంలోనే  ప్రజాప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులు,  6,956 న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు,  స్టాఫ్ న‌ర్సులు, 13,444  పోలీస్‌, అగ్నిమాప‌క‌, ర‌వాణా,  ఆబ్కారీ,  జైళ్ల శాఖ‌, 5,192 లెక్చరర్లు,  వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, 1,635  గ్రంథాల‌యాధికారులు,  వ్యాయామ ఉపాధ్యాయులు, ఏఈఈలు,  వ్యవసాయ అధికారులు,  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు,  సింగ‌రేణిలో 441 కారుణ్య నియామ‌కాలు, 
1,997 లైబ్రేరియ‌న్లు, వ్యాయామ సంచాల‌కులు, పీజీటీలు, 687 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నియామ‌కాలు చేప‌ట్టింది.  మొత్తంగా 30 వేల‌కుపైగా  కొలువులు యువ‌త‌కు ద‌క్కాయి.. అంటే 30 వేల కుటుంబాల్లో ఉద్యోగ కాంతులు విర‌జిమ్మాయి.  పైగా జాబ్ క్యాలెండ‌ర్‌ను రేవంత్ సర్కార్​ ప్రకటించింది.  ఎప్పుడు ఏ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు వ‌స్తాయో స్పష్టత ఉంది.  ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర‌య్యే వారికి పూర్తిగా క్లారిటీ వ‌చ్చింది.  ఈ విధంగా కాంగ్రెస్​ ప్రభుత్వం నియామ‌కాలే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుంటే  బీఆర్ఎస్‌,  బీజేపీలు ప్రభుత్వం కాళ్లలో క‌ట్టె పెట్టేలా,  నిరుద్యోగుల జీవితాలు రోడ్డునప‌డేలా కుట్రలు చేస్తున్నాయి. 

- ఈర‌వ‌త్రి అనిల్‌,  చైర్మన్, టీజీఎండీసీ