వివాదంలో ‘ది గ్రేట్ ఖలీ’.. అసలేం జరిగింది..? 

వివాదంలో ‘ది గ్రేట్ ఖలీ’.. అసలేం జరిగింది..? 

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) మాజీ ఛాంపియన్ ‘ది గ్రేట్ ఖలీ’ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ టోల్ బూత్ ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. టోల్ ప్లాజా ఉద్యోగులతో ఖలీ గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐడీ కార్డు అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని ఖలీ చెప్పుతో కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఖలీ మాత్రం.. టోల్‌ఫ్లాజా ఉద్యోగులు తనను బ్లాక్ మెయిల్ చేశారని చెబుతున్నాడు. జలంధర్ నుంచి కర్నాల్‌కు ఖలీ వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫిలౌర్‌లోని టోల్ ప్లాజా అని చెబుతున్నారు. 

ఫోటోలు తీయడానికి టోల్ ప్లాజా ఉద్యోగి ఒకరు కారులోకి వచ్చాడని, దీంతో తాను నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులు వచ్చి తన కారును చుట్టుముట్టి బ్లాక్‌మెయిల్ చేశారని రెజ్లర్ ఖలీ చెబుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో ఇరు వర్గాల ఘర్షణలో ఓ పోలీసు కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ‘నన్ను ఎందుకు కొట్టావు..?’ అని గ్రేట్ ఖలీని ఆ ఉద్యోగి పదే పదే అడుగుతున్నట్లు కనిపిస్తోంది. కాసేపటి తర్వాత గ్రేట్ ఖలీ తన కారు నుంచి బయటకు వచ్చి, పోలీసు కానిస్టేబుల్‌తోనూ, ఆ ఉద్యోగితోనూ మాట్లాడారు. 

సోమవారం (జులై 11న) జరిగిన సంఘటనతో రెజ్లర్ ఖలీపై విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. పంజాబ్‌లోని ఫిలౌర్‌లో ఉన్న టోల్ బూత్ ఉద్యోగి ఒకరు తన కారును ఆపి, సెల్ఫీ కోసం తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పాడు. దీంతో తాను సెల్ఫీని తిరస్కరించడంతో అతడు దురుసుగా ప్రవర్తించి.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని చెబుతున్నాడు ఖలీ.