BGT 2024-25: ఐదుగురితోనే తొలి బ్యాచ్.. ఆస్ట్రేలియా బయలుదేరిన భారత ఆటగాళ్లు వీరే

నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు తొలి బ్యాచ్ ఆదివారం (నవంబర్ 10) ఆస్ట్రేలియాకు బయలుదేరింది. లాజిస్టికల్ కారణాల వల్ల ఆటగాళ్లను బీసీసీఐ రెండు బ్యాచ్‌లుగా పంపనుంది. ఇందులో భాగంగా మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్,శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ , ఆకాశ్ దీప్ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆదివారం రాత్రి ఈ ఐదుగురు ఆటగాళ్లు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. 

ఐదుగురు ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది.. మొదటి బ్యాచ్‌లో భాగమైనట్లు సమాచారం. ఆసీస్ కు బయలుదేరే ముందు ఓపెనర్ జైస్వాల్ అభిమానులతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేశాడు. ఆస్ట్రేలియాకు బయలుదేరిన తొలి బ్యాచ్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేరు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో మిగిలిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల రెండవ బ్యాచ్ సోమవారం (నవంబర్ 11) ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది.

సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.