గణపురంలో విషాదం: కూతురు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె

ఖిల్లాగణపురం, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతూ కూతురు చనిపోవడంతో ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురి మరణవార్త విన్న వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురంకు చెందిన దేవరశెట్టి శ్రీనివాసులు(41) బతుకుదెరువు కోసం భార్య జ్యోతి, కూతురు వైశాలి(16), కొడుకు అభిరామ్‎తో కలిసి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. 

వైశాలి గత కొన్నాళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ ఆమె చనిపోగా, అక్కడేఉన్న తండ్రికి విషయం చెప్పడంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయాడు. డాక్టర్లు ఆయనను పరీక్షించి హార్ట్ ఎటాక్‎తో చనిపోయినట్లు తెలిపారు. కూతురు, తండ్రి ఒకేసారి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.