కోట్ల ఆస్తి తీసుకొని కొరివి పెట్టలే

  • కోట్ల ఆస్తి తీసుకొని కొరివి పెట్టలే
  • పిల్లలు లేక మరిది కొడుకులకు ఆస్తి రాసిచ్చిన సత్తెమ్మ
  • అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలు
  • శవాన్ని ఇంట్లోకి కూడా రానివ్వని మరిది కొడుకు
  • 6 గంటలపాటు అంబులెన్స్​లోనే మృతదేహం 
  • తాళాలు పగులగొట్టి ఇంట్లోకి తీసుకెళ్లిన పోలీసులు
  • ఆఖరికి బయటి వ్యక్తులతో సత్తెమ్మ చితికి నిప్పు
  • జగిత్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన
  • ఆమె మరిది కొడుకులపై సుమోటోగా కేసు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది.  ఆస్తి తీసుకున్న కుటుంబ సభ్యులే.. వృద్ధురాలి చితికి నిప్పుపెట్టేందుకు ముందుకురాలేదు. తమ పేరుమీద ఆస్తి రాయించుకున్న మరిది కొడుకులు.. ఆమె మృతదేహాన్ని ఆమె ఇంట్లోకే అనుమతించలేదు. దీంతో శవంతో వచ్చిన అంబులెన్స్​ ఇంటి ఎదుటే  6 గంటలపాటు పడిగాపులు కాసింది. చివరికి పోలీసులు వచ్చి.. ఆ ఇంటి తాళం పగులగొట్టి.. మృతదేహాన్ని లోనికి తరలించారు. 
జగిత్యాల పట్టణంలోని కటికవాడకు చెందిన సాదుల సత్తెమ్మ (85), లక్ష్మణ్ దంపతులకు పిల్లలు లేరు. 20 ఏండ్ల  క్రితం లక్ష్మణ్ మృతి చెందాడు. 

దీంతో తనను వృద్ధాప్యంలో చూసుకుంటారనే ఆశతో లక్మణ్​ సొంత తమ్ముడైన రిటైర్డ్ టీచర్ సాదుల ధర్మపురి కుమారులు సాదుల ప్రసాద్, సాదుల రవికి తనకున్న కోట్లు విలువ చేసే ఇంటి తో పాటు ఆస్తి మొత్తాన్ని సత్తెమ్మ రాసి ఇచ్చింది. కొంతకాలంగా సత్తెమ్మను ప్రసాద్, రవి నెల చొప్పున పోషిస్తున్నారు. ఉన్న పాత ఇంటిని అద్దెకు ఇచ్చి వేర్వేరు స్థలాల్లో ఇండ్లు కట్టుకొని జీవిస్తున్నారు. పెద్ద కొడుకు ప్రసాద్ వద్ద ఉంటున్న సత్తెమ్మ గత కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ.. మంగళవారం  మృతి చెందింది. దీంతో సత్తెమ్మ మృతదేహాన్ని పెద్ద కొడుకు ప్రసాద్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కటికవాడలోని పాత ఇంటి వద్ద కు తీసుకువచ్చాడు. ఇద్దరు అన్నదమ్ముల నడుమ ఉన్న ఆస్తి గొడవల నేపథ్యంలో పాత ఇంటి  తాళాలు తండ్రి ధర్మపురి వద్ద ఉన్నాయి. వారికి సమాచారం అందించాడు. అయితే, ఎంత సమయమైనా తండ్రి ధర్మపురి, తమ్ముడు రవి రాకపోవడంతో అంబులెన్స్ లోనే మృతదేహాన్ని ఉంచి, రాత్రి 11 గంటలవరకు ఇంటి ఆవరణలో వేచి చూశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వచ్చాక ఇంట్లోకి మృతదేహం

విషయం తెలుసుకున్న ఎస్సై గీత అక్కడికి చేరుకున్నారు.  రవికి ఫోన్​ చేసి ఇంటి తాళం తీసుకొని రావాలని కోరారు. అయితే, సత్తెమ్మ తన అన్న ప్రసాద్ వద్ద ఉన్నప్పుడే చనిపోయిందని, అతడి ఇంటికే డెడ్​బాడీని తీసుకువెళ్లాలని రవి చెప్పాడు. తన కూతురు పెళ్లి ఉండడంతో పాత ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచి, అంత్యక్రియలు చేయాలని ప్రసాద్ కోరాడు. దీంతో పోలీసులు ఆ పాత ఇంటి తాళాలను పగులగొట్టి, మృతదేహాన్ని లోనికి తీసుకెళ్లారు.      

బయటవాళ్లతో కొరివి..

అంత్యక్రియలు చేసేందుకు సత్తెమ్మ మరిది ధర్మపురి, చిన్న కొడుకు రవి రాకపోవడంతో ప్రసాద్ బుధవారం ఉదయం కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే, ప్రసాద్ కూతురు పెళ్లి త్వరలోనే ఉండడంతో ఆచారాల ప్రకారం కొరివి పెట్టేందుకు నిరాకరించాడు. బయట వ్యక్తులతో సత్తెమ్మ చితికి నిప్పు పెట్టించాడు.  ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి స్థానికులు కన్నీరుపెట్టుకున్నారు. తనకు తలకొరివి పెడతారనే ఆశతో ఉన్న యావదాస్తిని మరిది కొడుకులకు అప్పగించిన సత్తెమ్మ చివరికి అనాథలా వెళ్లిపోయిందంటూ విలపించారు.  ఆస్తి తగాదాలు, ఆచారాలతో అంత్యక్రియలకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల తీరుపై బంధువులు, పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిది కొడుకులపై సుమోటోగా కేసు

సాదుల సత్తెమ్మ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని ఇంట్లోని రానివ్వని ఘటనలో ఇద్దరు కొడుకులు ప్రసాద్, రవిపై సుమోటోగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై గీత తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.