కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు
ఇతర గ్రూప్ కంపెనీల అప్పులు మరో రూ. 5000 కోట్లు
మెజార్టీ షేర్లు తాకట్టులోనే.. పీఈ ఇన్వెస్టర్లు, ఫైనాన్స్ సంస్థల నుంచి పెరిగిన ఒత్తిడి
బ్యాంక్‌ల నుంచి 8 శాతం వడ్డీకి తీసుకొని 25 శాతం వడ్డీకి సిద్ధార్థకు అప్పులిచ్చిన విదేశీ పీఈ సంస్థలు
న్యూఢిల్లీ : కాఫీ టైకూన్ వీ జీ సిద్ధార్థ ఫ్లాగ్‌షిప్ కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్)కు మార్చి 2019 నాటికి రూ. 5,200 కోట్ల అప్పులున్నాయి. ఆయనకే చెందిన రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాలలోని అన్‌లిస్టెడ్ కంపెనీలకు కలిపి ఇంచుమించుగా ఇంతే మొత్తంలో అప్పులున్నట్లు తెలుస్తోంది. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్, కార్పొరేట్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఫైలింగ్స్ చూస్తే ఈ వివరాలు వెల్లడవుతున్నాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, స్నేహితులు….ఇలా చాలా మంది నుంచే సిద్ధార్థ అప్పులు చేశారు. ప్రధానంగా ఈ అప్పులన్నీ కాఫీయేతర వ్యాపారాల కోసమే చేసినట్లు భావిస్తున్నారు.
సీడీఈఎల్ అప్పులు ఏడాది కాలంలోనే రెట్టింపయ్యాయి. మార్చి 2018 నాటికి కంపెనీ అప్పులు రూ. 2,457.30 కోట్లు. ఇక సీడీఈఎల్‌కు ప్రమోటర్లుగా ఉన్న దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్, కాఫీ డే కన్సాలిడేషన్స్, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్, సివన్ సెక్యూరిటీస్ కంపెనీలు కూడా విపరీతంగా అప్పులు చేశాయి. టాటా కాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్, క్లిక్స్ కాపిటల్ సర్వీసెస్, షాపుర్జీ పలొంజి ఫైనాన్స్ వంటి వాటి నుంచి రూ. 12 కోట్ల అప్పు కోసం కూడా ప్రయత్నించినట్లు ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. ఏప్రిల్ 2018 లోని ఒక ఫైలింగ్ ప్రకారం గరిష్టంగా రూ. 12 కోట్లను టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్ (సబ్సిడరీ కంపెనీ)కు ఇవ్వడానికి షాపుర్జీ పలొంజి ఫైనాన్స్ సూత్రప్రాయంగా అంగీకరించింది. సిద్ధార్థకు చెందిన అన్‌లిస్టెడ్ కంపెనీల అప్పులు మొత్తం ఎంతనేది పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో లేవు.
2017 తర్వాత నుంచే సిద్ధార్థ ఎక్కువగా అప్పులు చేశారు. ఐతే, ఈ అప్పులలో ఎన్నింటిని ఎంత తీర్చారు, ఏవైనా అప్పులు ఎన్‌పీఏలుగా మారాయా అనేది ఇంకా తెలవాల్సి ఉంది. మార్చి 2018 నాటికి కాఫీ డే కన్సాలిడేషన్స్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ రూ. 36.53 కోట్లు. సీడీఈఎల్ ప్రమోటర్‌గా తనకున్న వాటాలో మూడొంతులకు పైగా షేర్లను ఈ అప్పుల కోసం వీ జీ సిద్ధార్థ తనఖా పెట్టినట్లు తేలుతోంది. ఆయనతోపాటు, ఇతర ప్రమోటర్ కంపెనీలూ తమ షేర్లను కుదువ పెట్టాయి. ఈ తనఖా పెట్టే ప్రక్రియ ఈ ఏడాది జూన్‌లో కూడా కొనసాగింది.
కాఫీ డే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్‌లో వీ జీ సిద్ధార్థ పేరు మీద 32.7 శాతం, ఆయన భార్య మాళవిక హెగ్డే పేరు మీద 4.05 శాతం వాటాలుండగా, నాలుగు ప్రమోటర్ గ్రూప్ కంపెనీలకు కలిపి 17 శాతం వాటాలున్నాయి. అంటే ప్రమోటర్లకు మొత్తం 53.93 శాతం వాటాలు సీడీఈఎల్‌లో ఉన్నాయన్నమాట. కంపెనీలో తమకున్న వాటాలో ఈ ప్రమోటర్ సంస్థలన్నీ కలిపి మొత్తం 75.0 శాతం (8.62 కోట్ల షేర్లు)ను కుదువపెట్టాయి. ఇటీవలే జూన్ నెలలో తాజాగా 1.39 శాతం వాటా (29.2 లక్షల షేర్లు)ను సిద్ధార్థ తనఖా పెట్టారు. కోటక్ మహీంద్రా బ్యాంకు నుంచి గ్రూప్ కంపెనీలు తీసుకున్న అప్పు కోసం ఈ షేర్లను కుదువ పెట్టారని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను కాఫీ డే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ ఆర్థిక ఫలితాల పరిగణనకు ఆగస్టు 8 న బోర్డు మీటింగ్ జరగనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది.
మూడో రోజూ షేర్లు కిందికే….
ఇదిలావుంటే, గురువారం నాడు కూడా కాఫీ డే షేర్లు పడిపోయాయి. కనిష్ట పరిమితి 10 శాతం మేర సీసీడీ షేర్ తగ్గింది. వరసగా మూడో రోజూ ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడకపోవడంతో కాఫీ డే షేర్ల పతనం ఆగలేదు. బీఎస్‌ఈలో 52 వారాల కనిష్టం రూ. 110.95 కి, ఎన్‌ఎస్‌ఈలో రూ. 110.50 కి కాఫీ డే షేర్లు పడిపోయాయి. మూడు రోజుల్లోనూ కలిపి మొత్తం 42 శాతం విలువను కాఫీ డే షేర్లు కోల్పోయాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ కూడా రూ. 1,723.16 కోట్లు తగ్గిపోయి, రూ. 2,343.84 కోట్లకు పరిమితమైంది. సర్క్యూట్ లిమిట్‌ను 10 శాతానికి పరిమితం చేయాలని బీఎస్‌ఈ బుధవారం నిర్ణయించింది.
