బీహార్ లో విద్యుత్ ఉద్యమం.. పోలీసుల కాల్పులు.. ఒకరి మృతి

బీహార్ లో విద్యుత్ ఉద్యమం.. పోలీసుల కాల్పులు.. ఒకరి మృతి

బీహార్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం హింసాత్మకంగా మారింది. కరెంట్ కోతలు, అధిక కరెంట్ ఛార్జీలకు నిరసనగా.. బార్ సోయ్ పట్టణం సమీపంలోని కతిహార్ అనే గ్రామంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది వ్యక్తులు.. కరెంట్ ఆఫీసుపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఓ వైపు వేల సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు.. మరో వైపు కరెంట్ ఆఫీసులో విధ్వంసానికి ప్రయత్నించటంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాకపోవటంతో.. కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా.. చాలా మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆందోళనాకారులు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని రాళ్లతో ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని బీహార్ పోలీసులు చెబుతున్నారు. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో ఫైరింగ్, లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టామంటున్నారు. విద్యుత్ శాఖకు చెందిన 12 మంది అధికారులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని మహ్మద్ ఖుర్షీద్ (35)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఒకరిని పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికు తరలించారు. మరో వ్యక్తిని కతిహార్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. 

ఈ సంఘటనపై బీజేపీ.. నితీష్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. బీహార్ ప్రతిపక్ష నాయకుడు విజయ్ సిన్హా, మాజీ ఉప ముఖ్యమంత్రి తారకిశోర్ ప్రసాద్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.