ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవి విద్యాసాగర్ సస్పెన్షన్ కు గురయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని అసభ్యంగా దూషించడం, ఏపీ ప్రభుత్వ విధానాల్ని విమర్శించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం విద్యాసాగర్ పై విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా విద్యాసాగర్ సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లు తేలింది.
సెక్షన్ 25 ను ఉల్లంఘించిన విద్యాసాగర్ పై దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు ఎపి హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ పి.వి. సునీల్‌కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ డిఇఇ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే ఏపీ ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని సునీల్‌కుమార్ అన్నారు.
