న్యూఢిల్లీ: 2026 నాటికి దేశంలోని స్మార్ట్ఫోన్ల యూజర్లు 100 కోట్లకు చేరతారని డెలాయిట్ స్టడీ వెల్లడించింది. 2021 నాటికి దేశంలో 120 కోట్ల మొబైల్ సబ్స్క్రయిబర్లుండగా, అందులో 75 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. రాబోయే అయిదేళ్లలో స్మార్ట్‌ఫోన్ మాన్యుఫాక్చరింగ్లో గ్లోబల్‌గా రెండో పెద్ద దేశంగా ఇండియా మారనుందని స్టడీ పేర్కొంది. రూరల్ ఏరియాలలో స్మార్ట్ఫోన్ల వాడకం భారీగా పెరుగుతోందని, ఏటా ఇది 6 శాతం దాకా ఉండొచ్చని డెలాయిట్ అంచనా వేస్తోంది. ఇంటర్నెట్ వినియోగం పెరగడమే స్మార్ట్ ఫోన్ల సంఖ్య అధికమవడానికి కారణమని ఈ స్టడీ వివరించింది. 2026 నాటికి అర్బన్ ఏరియాలలో కొత్త ఫోన్లు కొనాలనుకునే ప్రతీ వంద మందిలో 95 మంది కొత్త స్మార్ట్‌ఫోన్‌నే కొంటారని తెలిపింది. రూరల్ ఏరియాలలోనైతే ప్రతీ వంద మందిలో 80 మంది కొత్త స్మార్ట్ ఫోన్‌నే కొంటారని పేర్కొంది. 2021 నాటికి దేశంలో స్మార్ట్ఫోన్ల డిమాండ్ ఏడాదికి 30 కోట్లని, ఇది 2026 నాటికి 40 కోట్లకు పెరుగుతుందని డెలాయిట్ స్టడీ వెల్లడించింది. హైస్పీడ్ గేమింగ్, రిమోట్ హెల్త్‌కేర్ వంటి అప్లికేషన్ల వల్ల 5జీ గ్రోత్వేగంగా ఉంటుందని కూడా అంచనా వేసింది.
