కానిస్టేబుల్, హోంగార్డ్ లిక్కర్ దందా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్రమ లిక్కర్ దందా చేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డుతో పాటు మరో ఇద్దరిని డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్​పోర్టులోని ఔట్ పోస్టులో జేమ్యా నాయక్ కానిస్టేబుల్‎గా, బండారి లింగయ్య హోంగార్డుగా పని చేస్తున్నారు. వీరు ప్యాసింజర్ల నుంచి టికెట్లను తీసుకుని ఎయిర్​పోర్టులో డ్యూటీ ఫ్రీ లిక్కర్ ​కొనేవారు. 

ఆ తర్వాత వీటిని బయటకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. పక్కా సమాచారంతో వీరిద్దరితో పాటు వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు హరీశ్ కుమార్, రాఘవేందర్‎ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్​కృష్ణప్రియ తెలిపారు. నిందితుల నుంచి రూ.15 లక్షల విలువైన  46 డ్యూటీ ఫ్రీ మద్యం బాటిళ్లతోపాటు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు  మహేందర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.