న్యూఢిల్లీ: బిలియనీర్ జాక్ మా చైనీస్ ఫిన్‌టెక్ కంపెనీ యాంట్ గ్రూప్‌ను ఇక నుంచి కంట్రోల్ చేయబోరని సంస్థ ప్రకటించింది. షేర్‌హోల్డింగ్‌లో మార్పుల కారణంగా ఆయన ఓటింగ్ హక్కులు కోల్పోయారని తెలిపింది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, జాక్ మా గతంలో యాంట్ వద్ద 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ హక్కులు ఉండేవి. మార్పుల వల్ల ఆయన వాటా 6.2శాతానికి పడిపోయింది. 2020లో దాఖలు చేసిన యాంట్ ఐపీఓ పేపర్ ప్రకారం, జాక్‌కు యాంట్‌లో కేవలం 10శాతం వాటా మాత్రమే ఉంది. అయితే ఆయన రిలేటెడ్ ఎంటిటీల ద్వారా కంపెనీని కంట్రోల్ చేసేవారు. యాంట్‌లో 50.5 శాతం వాటాలు ఉన్న మరో రెండు సంస్థలను జాక్‌మా తన ఇన్వెస్ట్మెంట్ వెహికల్ హాంగ్‌జౌ యున్‌బో ద్వారా కంట్రోల్ చేసేవారు. యాంట్ గ్రూప్ తమ బోర్డులో ఐదవ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ని చేర్చుకుంటామని కూడా ప్రకటించింది. తద్వారా వీరికి కంపెనీ బోర్డులో మెజారిటీ ఉంటుంది. ప్రస్తుతం ఎనిమిది మంది బోర్డు డైరెక్టర్లు ఉన్నారు. ఫలితంగా యాంట్ గ్రూప్‌పై ఏ ఒక్క వాటాదారుడికీ నియంత్రణ ఉండదు. చైనీస్ రెగ్యులేటర్లు ఈ ఫిన్‌టెక్ కంపెనీ తన కన్జూమర్ యూనిట్ కోసం 10.5 బిలియన్ యువాన్లను ( 1.5 బిలియన్ డాలర్లు) సమీకరించే ప్రణాళికను ఆమోదించారు.
ఈ బిలియనీర్ 2020లో చైనీస్ రెగ్యులేటర్ల/బ్యాంకుల విధానాలను విమర్శించినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆయన స్థాపించిన రెండు కంపెనీలు యాంట్తోపాటు ఈ–-కామర్స్ గ్రూప్ అలీబాబా రెగ్యులేటరీ ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. యాంట్ 37 బిలియన్ల డాలర్ల ఐపీఓని కూడా చైనా ప్రభుత్వం రద్దు చేసింది. 2021లో యాంటీట్రస్ట్ సమస్యల కారణంగా అలీబాబాకు రికార్డు స్థాయిలో 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఆలీబాబా సర్వర్ నుంచి దాదాపు వంద కోట్ల మంది డేటా లీక్ అయిందని ఒక హ్యాకర్ చెప్పడంతో ప్రభుత్వం విచారణ జరిపింది.
