గవర్నమెంటు హాస్పిటల్​లో కాంట్రాక్టర్​ మాయ

  • 30 మందికి పైగా కార్మికుల జీతాలు స్వాహా
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్

వనపర్తి, వెలుగు : జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​ హాస్పిటల్​లో పని చేసే కార్మికులకు ఇచ్చే జీతాల్లో కాంట్రాక్టర్​ కోత విధించడమే కాకుండా, వారికి జీతాలిచ్చినట్లుగా ఏడాదిన్నరగా రూ.లక్షలు కాజేస్తున్న వైనం వెలుగు చూసింది. హాస్పిటల్​లో సెక్యూరిటీ, పేషెంట్​ కేర్, శానిటేషన్​ విభాగాల్లో పని చేసేందుకు ఒక ఏజెన్సీకి కాంట్రాక్టు అప్పగించారు. 148 మంది కార్మికులతో పని చేయిస్తున్నట్లు చూపిన కాంట్రాక్టర్​ 30 ‌‌‌‌‌‌మంది కార్మికులు పని చేయకున్నా చేస్తున్నట్లుగా అటెండెన్స్​ చూపించి ప్రతి నెలా రూ.లక్షల్లో జీతాలు కాజేస్తున్నాడు.

ఏడాదిన్నరగా ఈ తతంగం నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. చివరకు కార్మికులు కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హాస్పిటల్​ సూపరింటెండెంట్​ను ఆదేశించారు.

ఒక్కో కార్మికుడికి రూ.4 వేలు కోత..

ఔట్​ సోర్సింగ్​పై పని చేసే కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.15,500లు చెల్లించాల్సి ఉండగా, రూ.11,500 ఇస్తున్నాడు. 148 మంది కార్మికులకు ఇస్తున్నట్లుగా చూపుతున్నా, వాస్తవంగా 118 మందికే వేతనం ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఇలా నెలకు రూ.4.65 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ విషయం గత ప్రభుత్వం హయాంలోని ఓ ప్రజాప్రతినిధి వద్ద పని చేసే ఆఫీసర్​కు తెలవడంతో ఆయన ప్రతి నెలా మామూళ్లు తీసుకునేవాడని అంటున్నారు.

దీంతో తన అక్రమాలకు అడ్డు ఉండదన్న ధీమాతో కాంట్రాక్టర్​ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక ఒక్కో కార్మికుడు షిఫ్ట్​ పద్దతిలో 8 గంటలు పని చేయాల్సి ఉండగా, 10 గంటలు పని చేయించుకుంటున్నట్లు కార్మికులు వాపోతున్నారు.

అటెండెన్సే లేదు..

కార్మికుల అటెండెన్స్​ రిజిస్టర్​ను సూపరింటెండెంట్​కు చూపించి జీతాల బిల్స్ చేయాల్సి ఉండగా, నెలవారీ అటెండెన్స్​ను ఒక పేపర్​పై అందజేస్తున్నాడు. బయెమెట్రిక్​ ద్వారా అటెండెన్స్​ తీసుకోవాల్సి ఉండగా,  అక్రమాలకు వీలు ఉండదన్న ఉద్దేశంతో మెషీన్​ చెడిపోయినట్లుగా చూపి అక్రమాలకు పాల్పడుతున్నాడు. 3 నెలల జీతాలు పెండింగ్​లో ఉండగా, ఇటీవల కార్మికులు ధర్నా చేయడంతో ఒక నెల బకాయి విడుదల చేశారు. ఇంకా రెండు నెలల జీతాలు ఇవ్వాల్సి ఉంది. వాస్తవంగా బిల్లులతో సంబంధం లేకుండా ఏజెన్సీ కార్మికులకు ప్రతి నెలా జీతాలు ఇవ్వాలి.

ఎంక్వైరీ రిపోర్టు ఇచ్చాం..

కలెక్టర్​ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్​పై ఎంక్వైరీ చేసి రిపోర్టును కలెక్టర్​కు అందజేశాం. ఆఫీసర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. కార్మికుల నుంచి బయోమెట్రిక్​ అటెండెన్స్​ తీసుకునేలా ఏర్పాటు చేస్తాం. 

- రంగారావు, ఇన్ చార్జి సూపరింటెండెంట్​