50లక్షల టన్నుల వడ్లు కొన్నరు..ముగింపు దశకు వచ్చిన కొనుగోళ్లు

  • 60 శాతం సెంటర్లు క్లోజ్
  • రూ.11వేల కోట్ల విలువైన ధాన్యం సేకరణ

హైదరాబాద్, వెలుగు : వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సీజన్​లో ఇప్పటి వరకు సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ 50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. సర్కార్ టార్గెట్ 70 లక్షల టన్నులు కాగా.. 71శాతం ధాన్యం కొనేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వడ్లకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు పొలాల వద్దకే వెళ్లి వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పటి దాకా వ్యాపారులు 30 లక్షల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. కాగా, అక్టోబర్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

8వేల సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 4,939 (60 శాతం) కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయ్యింది. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యే చాన్స్ ఉన్నది. మొత్తం 55 లక్షల టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఎకరానికి యావరేజీగా 23 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అంటే, దాదాపు 1.53 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

21 లక్షల టన్నుల సన్నాల కొనుగోలు

రాష్ట్ర వ్యాప్తంగా 9.38 లక్షల మంది రైతుల నుంచి రూ.11,403 కోట్ల విలువైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. సివిల్ సప్లయ్స్ ద్వారా 21 లక్షల టన్నుల వరకు సన్న వడ్లు కొనుగోలు చేయగా.. 29.78 లక్షల టన్నుల దొడ్డు రకం కొనుగోళ్లు జరిగాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల వ్యవధిలో రైతులకు చెల్లింపులు చేస్తున్నది. అదేవిధంగా, క్వింటాళ్ల వారీగా బోనస్​ను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.

నిజామాబాద్‌‌, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌‌, జగిత్యాల, సిద్ధిపేట, పెద్దపల్లి, యాదగిరిగుట్ట, వరంగల్, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో  కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఆదిలాబాద్‌‌, మేడ్చల్‌‌, గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో తక్కువ కొనుగోళ్లు జరిగాయి.