‘నో డిటెన్షన్ పాలసీ’ రద్దు.. 5, 8 క్లాసుల్లో ఫెయిలైతే మళ్లీ చదవాల్సిందే

  • 5, 8 క్లాసుల్లో ఫెయిలైతే మళ్లీ చదవాల్సిందే
  • రీఎగ్జామ్​లో పాసైతేనే పైతరగతులకు ప్రమోట్
  • నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్రం 
  • కేంద్రం పరిధిలోని 3 వేల స్కూళ్లకు వర్తింపు 
  • కేవీ, నవోదయ, సైనిక్ స్కూల్స్​లో అమలు​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్‎లో 5, 8 తరగతులకు సంబంధించి ‘నో డిటెన్షన్ పాలసీ’ని రద్దు చేసింది. అంటే ఇకపై ఈ క్లాసుల స్టూడెంట్లు యాన్యువల్ ఎగ్జామ్స్‎లో ఫెయిల్ అయితే పై తరగతులకు ప్రమోట్ చేయరు. ఇలాంటి స్టూడెంట్లకు మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అందులో పాసైతేనే పై తరగతులకు పంపిస్తారు. లేదంటే అదే క్లాస్ మళ్లీ చదవాల్సి ఉంటుంది. ‘‘5, 8 తరగతుల స్టూడెంట్లు యాన్యువల్ ఎగ్జామ్స్‎లో ఫెయిల్ అయితే, వాళ్లకు అడిషనల్ కోచింగ్ ఇస్తారు. మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. రిజల్ట్ వచ్చిన రెండు నెలల్లోగా రీఎగ్జామ్ నిర్వహిస్తారు. 

ఒకవేళ రీఎగ్జామ్‎లోనూ ఫెయిల్ అయితే, ఇక ఆ స్టూడెంట్లు అదే క్లాస్ మళ్లీ చదవాల్సి ఉంటుంది. ఆ టైమ్‎లో స్టూడెంట్లతో పాటు తల్లిదండ్రులకు టీచర్లు గైడెన్స్ ఇస్తారు. స్టూడెంట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు” అని నోటిఫికేషన్‎లో కేంద్రం పేర్కొంది. చదువు పూర్తయ్యే వరకూ స్టూడెంట్లను స్కూల్ నుంచి బహిష్కరించడం అంటూ ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనలు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న 3 వేల స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి.

18 రాష్ట్రాల్లో ఇప్పటికే రద్దు.. 

స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర పరిధిలోని అంశమని, నో డిటెన్షన్ పాలసీపై ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. ‘‘ఇప్పటికే 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. హర్యానా, పుదుచ్చేరి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నో డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి” అని చెప్పారు. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అస్సాం, బిహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మేఘాలయా, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, దాద్రానగర్ హవేలీ, జమ్మూకాశ్మీర్ ఉన్నాయి. కాగా, మన తెలుగు రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానం అమలవుతున్నది. 

నో డిటెన్షన్ అంటే..? 

నో డిటెన్షన్ పాలసీ ప్రకారం.. ఒకటి నుంచి 8 తరగతుల వరకు స్టూడెంట్లను ఫెయిల్ చేయడం గానీ, స్కూల్ నుంచి బహిష్కరించడం గానీ చేయకూడదు. వాళ్లు తమ ప్రైమరీ ఎడ్యుకేషన్ (1–8) పూర్తి చేసే వరకూ ఆటోమేటిక్ గా పైతరగతులకు ప్రమోట్ చేయాలి. ఈ తరగతుల స్టూడెంట్లకు యాన్యువల్ ఎగ్జామ్స్ నిర్వహించినప్పటికీ, గ్రేడ్స్ ఇస్తారు. ఇందులో పాస్, ఫెయిల్ అంటూ ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు 5, 8 తరగతుల స్టూడెంట్లకు ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై పరీక్షల్లో పాస్ అయితే తప్ప ఈ క్లాసుల స్టూడెంట్లను పైతరగతులకు ప్రమోట్ చేయరు.