రామతీర్థం యాత్రలో ఉద్రిక్తత.. సోమువీర్రాజు అరెస్ట్

రామతీర్థం యాత్రలో ఉద్రిక్తత.. సోమువీర్రాజు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన చేపట్టిన రామతీర్థం యాత్ర ఉద్రిక్తత సృష్టించింది. యాత్రకు అనుమతి లేదంటూ ముఖ్య నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. గుంటూరు లో కన్నా లక్ష్మీనారాయణను గృహనిర్బంధం చేశారు.  విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో పాటు ఇతర నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. విశాఖ, విజయనగరంలోని బీజేపీ కార్యాలయాల దగ్గర భారీ  బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయం నుంచి రామతీర్థం బయలు దేరిన బీజేపీ నేతలు సీఎం రమేష్, కామినేని శ్రీనివాసరావులను పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం వెళ్లకుండా భీమిలి బీచ్  రోడ్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాలను ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నారు. నెల్లిమర్లలో తమను అడ్డుకోవడంపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే హిందూ ఆలయాలపై దాడులను నియంత్రించాలన్నారు. దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలన్నారు. మరోవైపు పోలీసుల ఆంక్షలను దాటుకొని ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు కొందరు రామతీర్థం చేరుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందన్నారు మాధవ్. ఇప్పటికైనా మెజార్టీ హిందువుల మనోభావాలు కాపాడాలని డిమాండ్ చేశారు.