IND Vs NZ, 1st Test: వికెట్ కీపర్‌గా జురెల్.. పంత్ గాయంపై బీసీసీఐ అప్ డేట్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్  బెంగళూరు టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా గురువారం (అక్టోబర్ 17) గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో నొప్పి తట్టుకోలేక వెంటనే మైదానం వీడాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ వచ్చి వికెట్ కీపింగ్ చేశాడు. మూడో రోజు ఉదయం పంత్ కీపింగ్ చేస్తాడని భావించినా అది జరగలేదు. ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడంతో పంత్ గాయంపై సస్పెన్స్ కొనసాగుతుంది. మూడో రోజు పంత్ వికెట్ కీపింగ్ చేయడని ప్రస్తుతం అతను వైద్య పర్యవేక్షణలో ఉన్నట్టు బీసీసీఐ తెలిపింది. 

జడేజా వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్ చివరి బంతిని ఆఫ్ సైడ్ దిశగా వేశాడు. ఈ బంతిని డ్రైవ్ చేయాలని భావించిన కాన్వే విఫలమయ్యాడు.బంతి మిస్ అయ్యి జడేజా మోకాలికి బలంగా తాకింది. దీంతో పంత్ అక్కడకక్కడే పడిపోయాడు. ఫిజియో చికిత్స చేసి పంత్ ను మైదానం నుంచి తీసుకెళ్లారు. పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాకపోతే టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. రెండో ఇన్నింగ్స్ చాలా కీలకం.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మూడో రోజు తొలి సెషన్ లో 70 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. క్రీజ్ లో రచీన్ రవీంద్ర (57) సౌథీ (8) ఉన్నారు. మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ జడేజా ధాటికి చక చక నాలుగు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం కివీస్ 211 పరుగుల ఆధిక్యం సంపాదించింది.