భూసేకరణ కొలిక్కివచ్చేనా అధికారులకు అడుగడుగునా అడ్డంకులు

  • సర్వేకు అడుగడుగునా అడ్డంకులు
  • కాళేశ్వరం కాల్వలు, ట్రిపుల్ ఆర్  నిర్మాణానికి ఆటంకాలు  
  • భూమికి భూమి ఇవ్వాలనే డిమాండ్ తో రైతుల దీక్షలు
  •  కొన్ని చోట్ల అలైన్​మెంట్ ​మార్చాలంటున్న రైతులు

మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్​ కాల్వలు, రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్ ఆర్)​కు అవసరమైన భూసేరణకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్​ పనులకు జిల్లా పరిధిలో వేలాది ఎకరాల భూములు సేకరించాల్సిన అవసరం ఉంది. కానీ చాలా చోట్ల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్నిచోట్ల భూమికి బదులు భూమి లేదా ఎకరాకు రూ.కోటి ఇస్తేనే భూములు ఇస్తామంటుండగా, మరికొన్ని చోట్ల అలైన్​మెంట్​ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల సర్వే పనులను రైతులు అడ్డగించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా మీదుగా సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ ప్రాజెక్ట్ కు నీరందించేందుకు ఉద్దేశించిన సంగారెడ్డి కెనాల్​ను రీచ్​1, రీచ్​2 గా నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకు మెదక్ జిల్లాలోని శివ్వంపేట, మనోహరాబాద్ మండలాల్లోని 14 గ్రామాల పరిధిలో భూమి సేకరించాల్సి ఉంది.

2019లోనే సర్వే చేపట్టిన అధికారులు రీచ్1 లో మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లి, కూచారం, కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లిలో 350 మంది రైతుల నుంచి 260.28 ఎకరాలు, రీచ్2 లో మనోహరాబాద్, జీడిపల్లి, పర్కిబండ, శివ్వంపేట మండలంలోని చెన్నాపూర్, పెద్ద గొట్టిముక్కుల, నర్సాపూర్​ మండలంలోని పెద్దచింతకుంట, చిన్నచింతకుంట, రెడ్డిపల్లి, చిప్పల్​ తుర్తి గ్రామాల పరిధిలో 784 మంది రైతుల నుంచి 391.02 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ మేరకు 2023 అక్టోబర్​లో భూసేకరణకు సంబంధించి పేపర్​ నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెలలో రెవెన్యూ అధికారులు సంబంధిత గ్రామాల రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిహారం విషయమై చర్చించారు. ఎకరాకు ఎంత పరిహారం ఇస్తారనేది అధికారులు ప్రకటించనప్పటికీ రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు ఏమాత్రం సరిపోదంటున్నారు. రైతుల డిమాండ్​ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు 
చెబుతున్నారు. 

  • అలైన్​మెంట్​ మార్చాలంటున్న  రైతులు  

రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఫస్ట్​ఫేజ్​మెదక్​ జిల్లాలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్​ మండలాల మీదుగా నిర్మాణం జరుగనుంది. ఇందుకు సంబంధించి దాదాపు 2021లోనే ఫీల్డ్ లెవల్​ సర్వే జరుగగా, కన్సల్టెన్సీ సంస్థ  రింగ్​ రోడ్డు వెళ్లే రూట్​లో మార్కింగ్​ ఇవ్వడంతో పాటు, హద్దురాళ్లు పాతారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్​నోటిఫికేషన్​జారీ చేయగా గతేడాది సెప్టెంబర్​లో అలైన్​మెంట్​ సర్వే చేపట్టారు. కాగా నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి, శివ్వంపేట మండలం రత్నాపూర్​ తదితర గ్రామాల  ప్రజలు, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అధికారులు సర్వేకు వెళ్లగా అడ్డుకున్నారు.

మొదట్లో సర్వే చేసిన ప్రాంతం నుంచి కాకుండా రింగ్ రోడ్డు అలైన్​మెంట్​మార్చారని అందువల్ల ఎక్కువ మంది  రైతులకు నష్టం జరుగుతోందంటున్నారు. మొదట్లో సర్వేచేసిన ప్రాంతం నుంచే రింగు రోడ్డు నిర్మించాలని డిమాండ్​చేస్తున్నారు. శివ్వంపేట మండలం రత్నాపూర్​లో రైతులు సర్వేకు వెళ్లిన అధికారుల కాళ్లపై పడి తమ భూములు తీసుకోవద్దని వేడుకున్నారు. రెడ్డిపల్లి రైతులు  రెండు సార్లు సర్వే పనులను అడ్డుకుని నేషనల్​ హైవే మీద ఎద్ద ఎత్తున ఆందోళన చేశారు. అలాగే కలెక్టరేట్​కు తరలివెళ్లి అలైన్​మెంట్​ మార్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇలా రైతుల అభ్యంతరాలతో భూసేకరణ ప్రక్రియకు బ్రేక్​ పడుతోంది.