కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పిన ఏపీ సర్కార్
డీటైల్డ్ ప్రాజెక్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినం
అనుమతి ఇయ్యాలని కేంద్రాన్ని, సీడబ్ల్యూసీని అడిగినం
తాము చేపట్టింది కొత్త ప్రాజెక్టేమీ కాదంటూ దబాయింపు
తెలంగాణ చేపట్టినవన్నీ కొత్త ప్రాజెక్టులని ఎదురు ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం కట్టి తీరుతామని ఏపీ మరోసారి తేల్చి చెప్పింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. తాము పనులు చేస్తున్నామనే సమాచారాన్ని బోర్డు దృష్టికి తీసుకువస్తున్నామని పేర్కొంది. సంగమేశ్వరం ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖను, సీడబ్ల్యూసీని కోరామని.. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టు డీటైల్స్ చెప్తున్నామని తెలిపింది. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు డీపీఆర్, పర్మిషన్ల అంశాలపై సోమవారం కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురేను ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, కర్నూల్ ప్రాజెక్టుల సీఈ మురళీనాథ్ రెడ్డి కలిసి వివరణ ఇచ్చారు. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం నిర్మాణాన్ని మొదలుపెట్టామని తేల్చిచెప్పారు. తాము నిర్మిస్తున్నది కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టులకు నీటిని అందించడానికే ఎత్తిపోతల పథకం చేపట్టామని.. దీనికి కొత్తగా ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో 880 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటిని తరలించడం సాధ్యమవుతుందని తెలిపారు. రిజర్వాయర్లో ఆ లెవల్ మెయింటైన్ కాకుండా తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా నాగార్జున సాగర్కు నీటిని తరలిస్తోందని ఆరోపించారు. అందువల్ల శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, గాలేరు నగరి, తెలుగు గంగ, చెన్నై వాటర్ సప్లయ్, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని ఇవ్వడానికే సంగమేశ్వరం లిఫ్ట్ తలపెట్టామని తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు గతంలో వచ్చిన హైడ్రాలజీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సహా ఇతర పర్మిషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లు బోర్డుకు అందజేశారు.
పర్మిషన్లు అవసరమే లేదు
పాత ప్రాజెక్టులకు అనుమతి ఉన్నందున కొత్తగా సంగమేశ్వరం లిఫ్ట్కు పర్మిషన్లు తీసుకోవాలనే ప్రశ్నే తలెత్తదని ఏపీ ఇంజనీర్లు వాదించారు. కేంద్ర జలశక్తి శాఖకు, సీడబ్ల్యూసీకి ఇదే విషయం చెప్పామన్నారు. అయితే కొత్తగా లిఫ్ట్ స్కీం చేపడ్తూ.. డీపీఆర్ ఇవ్వబోమని చెప్పడం ఏమిటని బోర్డు మెంబర్ సెక్రటరీ రాయ్పురే ప్రశ్నించారు. దీనికి ఏపీ ఈఎన్సీ వివరణ ఇస్తూ.. తాము ఇచ్చింది ప్రాజెక్టు డీపీఆర్ కాదని డీటైల్డ్ ప్రాజెక్టు ఇన్ఫర్మేషన్ అని స్పష్టం చేశారు. చేపట్టింది కొత్త ప్రాజెక్టు కాదు కాబట్టి.. కేవలం ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని కేంద్రానికి, కృష్ణాబోర్డుకు ఇచ్చామన్నారు. కానీ రెండో అపెక్స్ మీటింగ్ సందర్భంగా డీపీఆర్ ఇవ్వడానికి ఏపీ సీఎం అంగీకరించిన విషయాన్ని మెంబర్ సెక్రటరీ గుర్తు చెయ్యగా… డీపీఆర్ ఇస్తామన్న మాట నిజమేనని, సీడబ్ల్యూసీ రూల్స్ ప్రకారం కొత్త ప్రాజెక్టు కడ్తేనే డీపీఆర్ ఇవ్వాల్సి ఉంటుందని వాదించారు. తాము చేపట్టింది కొత్త ప్రాజెక్టు కాదంటూ మళ్లీ మళ్లీ చెప్పారు. అన్ని పర్మిషన్లు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించిందని మెంబర్ సెక్రటరీ ప్రశ్నించగా.. ఇన్వెస్టిగేషన్స్, ప్రిపరేటరీ వర్క్స్ చేసుకునేందుకు ఎన్జీటీ అనుమతి ఇచ్చిందని, ఆ ప్రకారమే పనులు మొదలుపెట్టామని ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ వాదన విన్న మెంబర్ సెక్రటరీ.. ఏపీ ఇచ్చిన సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ డైరెక్టర్కు నివేదిస్తామని, కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని ప్రకటించారు.
తెలంగాణ ప్రాజెక్టులే కొత్తవి: ఏపీ ఈఎన్సీ
సంగమేశ్వరంలో తాము తలపెట్టింది కొత్త ప్రాజెక్టు కాదని.. పాత ప్రాజెక్టుల ఆయకట్టును సప్లిమెంట్ చేసుకోవడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పర్మిషన్లూ అవసరం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అన్నారు. కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కొత్తవని.. ఉమ్మడి ఏపీలో డిజైన్ చేసిన ప్రాజెక్టులకు అదనంగా స్టోరేజీ, ఆయకట్టును చేర్చారని, వాటికి కొత్తగా పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కృష్ణా బేసిన్లోనే బోర్డు హెడ్క్వార్టర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. బోర్డులకు జ్యూరిస్డిక్షన్ ఇస్తే ప్రాజెక్టుల మానిటరింగ్ కష్టం కదా అని ప్రశ్నించగా.. బోర్డు కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుందని, తమ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది కాబట్టే వైజాగ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఒకేసారి నీటిని డ్రా చేస్తారన్నది సరికాదని, గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోవడం సాధ్యం కానప్పుడు.. తమ కోటా నీళ్లు లిఫ్ట్ చేసుకుంటామని వెల్లడించారు.
ఏప్రిల్ లో వైజాగ్ కు బోర్డు హెడ్ క్వార్టర్స్
వైజాగ్ బీచ్ పక్కన నిర్మించిన టవర్స్లో కృష్ణా బోర్డు హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ ఈఎన్సీ స్పష్టం చేశారు. బేసిన్ బయట హెడ్ క్వార్టర్స్ పెట్టడం ఏమిటని మెంబర్ సెక్రటరీ ప్రశ్నించగా.. వైజాగ్లోనే పెట్టాలని తమ సర్కారు నిర్ణయించిందని ఏపీ ఈఎన్సీ చెప్పారు. వైజాగ్కు ఎయిర్ కనెక్టివిటీతో పాటు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని బోర్డుకు పంపిస్తామని తెలిపారు.
