న్యూఢిల్లీ: సరదాగా బీచ్‌కు వెళ్లిన ఓ మహిళకు ఓ వింత వస్తువు కనబడింది. దగ్గరికెళ్లి చూస్తే చేపలా వాసనొచ్చింది. కాసేపు అలా చూసి.. ఏందో చూద్దాంలే అని ఇంటికి తీసుకొచ్చింది. తీరా ఆ వస్తువేంటని ఆరా తీస్తే కోట్లు పలుకుతుందని తెలిసి అవాక్కయింది. ఇంతకీ ఆ వస్తువేంటో తెలుసా? తిమింగలం వాంతి చేసినప్పుడు బయటకు వచ్చే ద్రవం. దీన్ని అంబర్‌గ్రిస్ అంటారు. థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి తమ్మరత్ ప్రావిన్స్‌లో ఉండే సరిపోర్న్ నియామ్‌రిన్ (49) అనే మహిళకు తన ఇంటికి దగ్గర్లోని బీచ్‌లో ఫిబ్రవరి 23న దొరికిందీ అంబర్‌గ్రిస్. దీని విలువ మన ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్లు. 24 ఇంచుల పొడువు, 12 ఇంచుల వెడల్పుతో 7 కిలోల బరువుంది.
నీటిపై తేలాడే బంగారం
స్పర్మ్ వేల్స్ రకం తిమింగలాలు.. అవి తినే జంతువుల్లోని పదునైన భాగాల వల్ల కడుపులోపలి భాగాలు దెబ్బతినకుండా అంబర్‌గ్రిస్ స్రవిస్తాయి. ఇది బయటపడినపుడు ముద్దలా తయారవుతుంది. అది బూడిద రంగులో మైనం ముద్దలా ఉంటుంది. మండే గుణం కూడా కలిగి ఉంటుంది. చాలా ఖరీదైనది. ఆల్కహాల్, క్లోరోఫామ్, ఇథర్, ఇతర నూనెల్లో కరుగుతుంది. దీన్ని ఎక్కువగా సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. ఎక్కువగా దొరకదు కాబట్టే దీన్ని నీటిపై తేలియాడే బంగారం అని కూడా అంటారు.
