కరెంటోళ్లకు ఓ టోల్‍ఫ్రీ.. విద్యుత్​శాఖ అత్యవస సేవలకు 1912 వెహికల్స్​

  • సర్వీస్‍ మెటీరియల్‍తో నిమిషాల్లో రానున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీం 
  • బ్రేక్‍ డౌన్లు, ట్రాన్స్​ఫార్మర్ల ఫెయిల్యూర్లు వెంటనే క్లియర్‍  
  • వరంగల్‍కు 2 వాహనాలు కేటాయించిన ఎన్‍పీడీసీఎల్‍ సంస్థ 

వరంగల్‍, వెలుగు: అత్యవసర సేవలకోసం టీజీఎన్​పీడీసీఎల్​ టోల్‍ఫ్రీని ఏర్పాటు చేసింది. అంబులెన్స్​తరహా 1912 వాహనాలను అందుబాటులోకి తెలచ్చింది. విద్యుత్‍ శాఖలో బ్రేక్‍ డౌన్లు, ట్రాన్స్​ఫార్మర్‍ ఫెయిల్యూర్లను వెంటనే క్లియర్​చేయనుంది. గాలులు, వానల కారణంగా వైర్లపై చెట్లు విరిగిపడటం, ఓవర్‍ లోడ్‍ కారణంగా నగరంలో కరెంట్‍ నిలిచిపోతే వినియోగదారులు టోల్‍ఫ్రీ నంబర్‍కు సమాచారమిస్తే చాలు  ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీం నిమిషాల వ్యవధిలో అక్కడకు వచ్చి సమస్య క్లియర్‍ చేస్తుంది. ఆఫీసర్లు ఇప్పటికే టోల్‍ ఫ్రీ పై పెద్దఎత్తున ప్రచారం చేస్తుండగా, సర్వీస్‍ ఇవ్వడానికి ఓరుగల్లుకు రెండు 1912 వెహికల్స్​చేరుకున్నాయి.  

వాహనంలో రెస్పాన్స్​ టీం, ఎమర్జెన్సీ కిట్‍..

వానాకాలంలో, ఎండాకాలంలో మాములుగా కరెంట్‍ నిలిచిపోయే సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సమస్య తెలుసుకోడానికి సిబ్బంది అక్కడకు రావడం, కావాల్సిన వైర్లు, ట్రాన్స్​ఫార్మర్‍, ఇన్సులెటర్ల కోసం మరోసారి ఆఫీస్‍ వెళ్లిరావడం, పోల్‍ ఎక్కి ఒకరిద్దరు సిబ్బందితో నానాతంటాలు పడి కరెంట్‍ పునరుద్ధరించడానికి గంటల సమయం తీసుకుంటోంది. అప్పటివరకు ఆ ప్రాంతంలోని వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

ప్రస్తుతం సంస్థ తీసుకొచ్చిన 1912 ఎమర్జెన్సీ వాహనంలో కరెంట్‍ వైర్లు, థర్మో విజన్‍ కెమెరాలు, ఫ్యూజులు, తాళ్లు, కండక్టర్లు, పవర్‍ రంపం మిషిన్‍, 9 మీటర్ల వరకు పొడవాటి నిచ్చెన వంటివి అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ట్రాన్స్​ఫార్మర్‍ ఫెయిల్‍ అయితే వెంటనే మార్చడానికి మరో ట్రాన్స్​ఫార్మర్‍ తీసుకెళ్లడానికి వెహికల్‍ రెడీగా ఉంటుంది. ఒక్కో వాహనంలో లైన్‍మెన్‍, ఇద్దరు జూనియర్‍ లైన్‍మెన్లు, ఏఎల్‍ఎంతో కూడిన ఎమర్జెన్సీ టీం సకాలంలో స్పందించి సమస్యను క్లియర్‍ చేయనున్నారు.

సమస్య తీవ్రతను బట్టి సేవలు.. 

ఎన్‍పీడీసీఎల్‍ సంస్థ 1912 వాహనాల సేవలను ఇన్నాళ్లూ హైదరాబాద్‍ వంటి నగరాల్లో అందించగా, ఇప్పుడు వరంగల్‍తోపాటు కరీంనగర్‍ వంటి సిటీల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. వరదలు, విపత్తులు వంటి అత్యవసర సమయాల్లో సమస్య తీవ్రత ఆధారంగా 24 గంటల పాటు 1912 వాహనాలు వారికి కేటాయించిన ఏరియాలో అత్యవసర సేవల కోసం పనిచేస్తాయి.

 సంస్థ కార్పొరేట్‍ ఆఫీస్‍ నుంచి ఈ సేవలను పర్యవేక్షిస్తుంది. వినియోగదారుడు ఈ నంబర్‍కు ఫోన్‍ చేయగానే అక్కడుండే సిబ్బంది సమస్య, అది ఏర్పడిన ప్రాంతాన్ని తెలుసుకుని సంబంధిత ఏరియా అధికారికి పంపిస్తుంది. అనంతరం ఫిర్యాదుదారుడికి మెసేజ్‍ వెళ్తుంది. సంబంధిత సిబ్బంది రంగంలోకి చర్యలు తీసుకుంటారు. ఈ ఎమర్జెన్సీ సేవలపై సంస్థ ఉన్నాతాధికారులు రెగ్యూలర్‍గా రివ్యూ నిర్వహిస్తారు. 

టోల్ ఫ్రీ సర్వీసుల్లో ఇవి కూడా..

ఎన్‍పీడీసీఎల్‍ తీసుకొచ్చిన 1912 వెహికల్‍ సర్వీస్‍ ఎమర్జెన్సీ సేవల కోసం పనిచేయగా, ఫిర్యాదుల ద్వారా ఇతర సమస్యలను కూడా పరిష్కరించనున్నారు. ఇందులో కరెంట్‍ సర్వీసులో ఇబ్బందులు, బిల్లులో ఎక్కువ తక్కువలు, ఫ్యూజ్‍ ఆఫ్‍ కాల్స్​, కరెంట్‍ మీటర్ల మార్పు, పేరు మార్పు, లోడ్‍ సమస్య, కేటగిరి మార్పు వంటివి ఉన్నాయి.

సమస్య తీవ్రత ఆధారంగా పైనుంచే సర్వీస్‍ సెక్షన్‍ టీం సిబ్బందికి పనిని అప్పజెబుతుంది. వినియోగదారులకు విద్యుత్​ అంతరాయాన్ని తగ్గించే క్రమంలో, టీజీఎన్‍పీడీసీఎల్‍ సంస్థ 1912 సేవలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.